బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార జంటగా నటించిన “ఆరడుగుల బుల్లెట్” సినిమా అనేక వాయిదాల తదనంతరం, జూన్ 9వ తేదీకి ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ వారం రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. అసలు విడుదల కావడమే గగనం అనుకున్న తరుణంలో… ఏకంగా ఆడియో రిలీజ్ కం ప్రీ రిలీజ్ ను నిర్వహించడంతో ఖచ్చితంగా విడుదల అవుతుందేమోనని భావించారు.
అయితే అలాంటి వాటికి తావు లేకుండా… ముందుగా అంచనాలు వేసిన ప్రకారమే గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” సినిమా విడుదల కాలేదు. ఈ సినిమాకు సంబంధించి ఆర్ధిక ఇబ్బందులు పరిష్కారం కాకపోవడమే సినిమా విడుదలను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. తొలుత మ్యాట్నీ షో మాత్రమే వాయిదా వేసారని భావించగా, ఆ తర్వాత రిలీజ్ డేట్ నే వాయిదా వేసారని తెలిసింది. ఈ సినిమా విడుదల కోసం ఓ బడా నిర్మాత కూడా రంగంలోకి దిగినప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేదని వినికిడి.
సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు ఓ ఎన్ఆర్ఐ, తనకు ఈ సినిమా నిర్మాత దాదాపుగా 6 కోట్లు చెల్లించాలని మీడియాకు ఎక్కడంతో, అప్పుడే సినిమా రిలీజ్ పై సందేహాలు తలెత్తాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం మౌనం వహించడంతో బ్యాక్ గ్రౌండ్ సెటిల్మెంట్స్ జరిగాయేమోనని భావించినప్పటికీ, అది నిజం కాదన్న విషయం రిలీజ్ ఆగడంతో బయటకు వచ్చింది. మళ్ళీ త్వరలోనే కొత్త డేట్ ను నిర్మాతలు ప్రకటించనున్నారు. అయితే రిలీజ్ డేట్ లో మార్పు వలన సినిమా రిజల్ట్ లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చులే..!



