ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు భారీ స్కోర్ ను చేజ్ చేసి ఘనవిజయం అందుకోగా, రెండవ మ్యాచ్ లో కివీస్ కూడా అదే ఊపును కొనసాగిస్తూ… 291 పరుగులు చేసింది. దీంతో ఈ టోర్నీలో పరుగుల వరద ఖాయమని భావించిన తరుణంలో… వరుణ దేవుడు రూపంలో మ్యాచ్ లకు అడ్డం వస్తుండడంతో, క్రికెట్ ప్రేమికులు నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా టోర్నీలో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఇరు దేశాలకు ఎంత ప్రాముఖ్యమో, ఆసీస్ – కివీస్ జట్ల మ్యాచ్ కూడా ఆ రెండు దేశాల అభిమానులకు అంతే ప్రాధాన్యత!
ఈ మ్యాచ్ లో వర్షం వలన మ్యాచ్ ను 46 ఓవర్లకే కుదించగా, కెప్టెన్ విలియమ్సన్ (100) సెంచరీతో భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టింది కివీస్. అయితే ఒక్కసారి కెప్టెన్ ఔటైన తర్వాత ఆ భారీ స్కోర్ ను సాధించే క్రమంలో 45 ఓవర్లలో 291 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వర్షం రావడంతో, ఆసీస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 235 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఆసీస్ బ్యాట్స్ మెన్లను నిలువరించడంలో సక్సెస్ అయిన కివీస్ బౌలర్లు 9 ఓవర్లలో 3 వికెట్లను పడగొట్టి 53 పరుగులు ఇచ్చుకున్నారు. ఈ తరుణంలో మళ్ళీ వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు.
ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ జట్టు ఆధిపత్యంలో ఉండడంతో ఒకవేళ వర్షం రాని పక్షంలో విజయావకాశాలు కివీస్ కే ఎక్కువగా ఉన్నాయి. వరుణుడి వలన ‘ఎస్కేప్’ అయ్యామని స్మిత్ కూడా ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే ఇలా వర్షాలు కురుస్తుంటే… ఈ ఆసీస్ – కివీస్ మ్యాచ్ మాదిరే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఎలా సాగుతుందో అన్న ఆందోళన క్రికెట్ ప్రేమికుల్లో కలుగుతోంది. ఇలాంటి ఐసీసీ టోర్నీలలో తప్ప ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు జరిగే అవకాశం కనపడడం లేదు. వచ్చిన ఈ అవకాశాన్ని కూడా తిలకించడానికి లేకుండా వరుణుడు తన్నుకుపోతే సగటు క్రికెట్ ప్రేమికులలో నిరుత్సాహం కలగడం సహజమే.



