వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, కొందరు వైసీపీ నేతల ఇళ్ళలో సోదాలు చేశారు. సోదాలలో కీలక పత్రాలు, నగదు స్వాధీనం వంటి రొటీన్ కబుర్లు షరా మామూలే.
కానీ ఈ సోదాలు వాటి కోసం కాదని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కనిపెట్టి చెప్పారు. “డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న ఆందోళనలతో సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కనుక కేంద్రంతో మాట్లాడి ఈడీ చేత వైసీపీ నేతల ఇళ్ళలో సోదాలు నిర్వహింపజేశారు. తద్వారా వివేకా హత్య కేసుని మరోసారి తెరపైకి తెచ్చి డీఎస్సీలో అవకతవకలపై వైసీపీ చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలనుకున్నారు,” అని చెప్పారు.
బోడిగుండుకు మోకాలుకీ ముడేయడం అంటే ఇదే అనిపిస్తుంది. ఇది వరకు ఓసారి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రధాని మోడీని కోరుతుంటారని, కానీ ప్రధాని మోడీ అంగీకరించడం లేదని వైసీపీ సొంత మీడియా గొప్పగా చెప్పుకుంది.
మరి అలాంటప్పుడు, ప్రజల దృష్టి మళ్ళించడం కోసం అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ చేత సోదాలు నిర్వహించాలని సిఎం చంద్రబాబు నాయుడు కోరారని, అందుకు ప్రధాని మోడీ ఒప్పుకున్నారన్నట్లు శ్రీకాంత్ రెడ్డే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.





