“బాహుబలి” సినిమా కోసం రాజమౌళి ఎంతలా కష్టపడ్డారో అన్న విషయం సిల్వర్ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా కనపడింది. అలాగే ఈ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా సినీ ప్రేక్షకులు అందించారు. ఇప్పటివరకు దాదాపుగా 1600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన ఈ సినిమాకు అసలు రాజమౌళి ఎంత మొత్తం తీసుకున్నారు? ఈ సందేహం ఇప్పుడు తలెత్తింది కాదు, ‘బాహుబలి 2’ ఈ స్థాయికి చేరుకున్న తర్వాత సహజంగా సినీ ప్రేక్షకుల మదిలో మెదిలిన సందేహం.
అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి విస్పష్టంగా దీనికి సమాధానం ఇచ్చారు. నిజానికి పారితోషికం పరంగా తాము తీసుకున్నది చాలా తక్కువ మొత్తం అని, కానీ అది కాకుండా పర్సంటేజ్ కూడా ఉంటుందని స్పష్టం చేసారు. అయితే ఎంత పర్సంటేజ్ తీసుకున్నాను అని చెప్పడం నాకేమీ ఇబ్బంది కాదు గానీ, నాది చెప్పడమంటే, సినిమాలోని ఇతరుల పర్సంటేజ్ లు చెప్పాల్సి వస్తుంది గనుక, అది తనకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదని వివరణ ఇచ్చుకున్నారు.
ఒక్క విషయమైతే జక్కన్న ఫుల్ క్లారిటీతో సమాధానం ఇచ్చారు. రెమ్యూనరేషన్ కాకుండా పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉందని, సినిమా హిట్టయితే అంతా తీసుకుంటాం, ఒకవేళ ఫ్లాప్ అయితే అంతా భరిస్తాం అందుకే ఇలా నిర్ణయించుకున్నామని తెలిపారు. నిజానికి ‘బాహుబలి 1’ సినిమాను 40 కోట్ల నష్టంతో విడుదల చేసామని, ఆ సమయంలోనే చాలా భయం వేసిందని, ముఖ్యంగా తెలుగునాట టాక్ సరిగా లేకపోవడం ఆందోళనకు గురి చేసిందని, అయితే ఆ తర్వాత ఎప్పుడూ భయపడలేదని తెలిపారు.
తన తదుపరి సినిమా ఏది అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కధ అనుకున్న తర్వాత దానికి తగిన విధంగా హీరోల ఎంపిక ఉంటుందని చెప్పిన రాజమౌళి, ఆ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయినా అవ్వొచ్చు, కాకపోవచ్చు అంటూ మళ్ళీ అదే విస్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు అనేక కధలు విన్నాను గానీ, ఇంకా మైండ్ లో ఏది రిజిస్టర్ అవ్వడం లేదని, ‘బాహుబలి’ ప్రభావం ఇంకా పోయినట్టు లేదని, రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని మాత్రం భావిస్తున్నానని తెలిపారు జక్కన్న.



