వైసీపి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో ఉండగా తనకు పార్టీలో చాలా అవమానం జరుగుతోందని, జగన్ కూడా తనను కాదని పార్టీలో తనను దెబ్బతీయాలని చూస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నారంటూ బాధపడని రోజు లేదు.
ఇలా అయితే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతానంటూ ఎన్నోసార్లు అలకపాన్పు ఎక్కేవారు. చివరికి ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం పాలై, అధికారం కోల్పోయాక బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. రాజకీయాలలో ఇదేం పెద్ద విచిత్రం కాదు.
అయితే జనసేనలో చేరినా ఆయన మనసు ఇంకా వైసీపిలోనే ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్-షర్మిల ఆస్తుల వివాదం గురించి మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్ళు పెట్టుకోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తాను వైసీపిని వీడినా వైఎస్ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని అన్నారు. అన్నాచెల్లి ఆస్తుల కోసం తగువులాడుకుంటుంటే వైఎస్ఆర్ పేరు, ఆయన కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటుండటం తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు.
విజయమ్మ వారి తల్లి గనుక ఇద్దరిలో ఎవరికీ అన్యాయం చేయరని కనుక ఈ ఆస్తుల పంపకాల విషయంలో ఆమెకు మాత్రమే తీర్పు చెప్పే అధికారం ఉందని, జగన్, షర్మిల ఇద్దరూ వారి తల్లి విజయమ్మ మాటకు కట్టుబడి ఉండాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఇంటి ఆడపడచు కన్నీళ్ళు పెడితే జగన్ కుటుంబానికి మంచిది కాదని కనుక ఆమెను బాధ పెట్టవద్దని జగన్‌కు హితవు చెప్పారు.
వైసీపిలో ఉన్నప్పుడు ఆయనకు జగన్ తీరు నచ్చేది కాదు కనుక అప్పుడు టిడిపి, జనసేనలవైపు చూస్తుండేవారు.
ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత మళ్ళీ జగన్, వైఎస్ కుటుంబం పట్ల ప్రేమ, విధేయత మొదలైన్నట్లున్నాయి. అందుకే బాలినేని ఈవిదంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.
జగన్‌ని వద్దనుకొని వైసీపిని వీడి జనసేనలో చేరాక కూడా బాలినేని మనసు వైసీపిలో ఉండిపోయిన్నట్లుంది. ఇటువంటి నేతలను నమ్మి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వారిని చంకనెక్కించుకుంటే, జనసేనకే ప్రమాదం.
ఈ 5 ఏళ్ళు జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, జనసేన బలాలు, బలహీనతలు, లోటుపాట్లు అన్నీ తెలుసుకున్నాక బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ వైసీపిలోకి వెళ్ళిపోతే? ఆయన ఈ 5 ఏళ్ళలో ఒంగోలులో జనసేన క్యాడర్‌ని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా ఉంటారా? చేస్తే జనసేన పరిస్తితి ఏమిటి? పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి.




