జనసేనలో బాలినేని చేరిక టిడిపికి ఇబ్బందే!

Balineni Srinivasa Reddy Joining In JanaSena Is a Problem for TDP!

బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు. మొదట ఆయన పవన్‌ కళ్యాణ్‌నే ఒంగోలుకి రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహించి తన బలం చాటుకొని జనసేనలో చేరాలనుకున్నారు.

కానీ పవన్ అందుకు అంగీకరించకపోవడంతో బాలినేని తన అనుచరులను వెంటేసుకొని భారీ ఊరేగింపుగా మంగళగిరికి బయలుదేరాలనుకున్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ దానికీ అంగీకరించలేదు. బాలినేని ఒక్కరే ఎటువంటి హడావుడీ చేయకుండా వచ్చి పార్టీలో చేరాలని సూచించారు.

ADVERTISEMENT

బాలినేని ఈ షరతులు జీర్ణించుకోవడం కష్టమే కానీ మరోదారి లేదు కనుక నేడు ఒక్కరే మంగళగిరికి బయలుదేరుతున్నారు. బాలినేనితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య కూడా జనసేనలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే బాలినేని చేరిక ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. శాసనసభ ఎన్నికలలో బాలినేని ఆయనపై అనేక విమర్శలు చేశారు. ఒంగోలులో దామచర్ల గెలుపుతో జిల్లాలో టిడిపి మళ్ళీ బలపడేందుకు అవకాశం కలిగింది. కానీ ఇప్పుడు బాలినేని తదితరులను మిత్రపక్షమైన జనసేనలో చేర్చుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

జిల్లా రాజకీయాలపై తన పట్టు ఇంకా పెంచుకోవాలనే బాలినేని ప్రయత్నిస్తారు తప్ప టిడిపి కోసం వెనక్కు తగ్గరు. బాలినేని ద్వారా జిల్లాలో జనసేన బలపడుతుందని పవన్‌ కళ్యాణ్‌ ఆశించడం సహజం. కనుక ఇటువంటి చేరికలు టిడిపి, జనసేనల మద్య చిచ్చు రగిలించే ప్రమాదం ఉంటుంది.

ఇక బాలినేని బ్లడ్ గ్రూప్, డీఎన్ఏ అన్నీ కూడా వైసీపివే. కనుక ఆయన ధోరణి, రాజకీయాలు అన్నీ కూడా ఆవిదంగానే ఉంటాయి. ప్రస్తుతానికి ఆయన తల దాచుకునేందుకు జనసేనలో చేరుతున్నా వచ్చే ఎన్నికలలో పరిస్థితులు మారితే మళ్ళీ వైసీపిలోకి జంప్ చేయకుండా ఉండరు. అదే జరిగితే ఆయనని నమ్మినందుకు జనసేన పార్టీయే నష్టపోతుంది. కనుక చేరికల విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి ముగ్గురూ కలిసి మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటే అందరికీ మంచిది.

ADVERTISEMENT
Latest Stories