ఐటి కంపెనీలను వారే ఏపీకి సాగనంపుతారేమో

Bangalore IT companies considering move to Andhra Pradesh due to infrastructure and government policies

దేనినైన కొత్తగా మొదలుపెట్టడం, నిర్మించడం, నిలబెట్టడం, నిర్వహించడం చాలా కష్టం. కానీ నాశనం చేయడం చాలా సులువు. కనుక ఉన్నవి కాపాడుకొంటూ కొత్తవి నిర్మించుకోవడం విజ్ఞుల లక్షణం.

బెంగళూరులో ఐటి రంగం అభివృద్ధి చెందడానికి సుమారు మూడు దశాబ్దాలు పట్టింది. అప్పటి ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి, అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి ఐటి కంపెనీలను ఆకర్షించాయి.

ADVERTISEMENT

బెంగళూరులో పచ్చదనం, వాతావరణం, భౌగోళిక స్థితి, రవాణా సౌకర్యాలు వంటివి కూడా ఐటి కంపెనీలను ఆకర్షించాయి. ఒక పెద్ద ఐటి కంపెనీ వస్తే దాని వెనుకే పది చిన్న కంపెనీలు వస్తుంటాయి. అలా ఐటి కంపెనీల సంఖ్య, వాటితో పాటు ఉద్యోగాలు, ఆదాయం, వలసలు, అభివృద్ధి అన్నీ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

కనుక దేశానికి బెంగళూరు ఐటి రాజధానిగా మారి, కర్ణాటక రాష్ట్రాభివృద్ధికి ఇంతగా దోహదపడుతున్నప్పుడు, ఐటి కంపెనీలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూర్చొన్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేస్తోంది!

‘బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వేరే రాష్ట్రానికి తరలిపోతే మంచిదనిపిస్తోందని’ ఓ ఐటి కంపెనీ సీఈఓ ట్వీట్ చేస్తే, ‘ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గే ప్రసక్తే లేదు. ఉంటే ఉండండి పోతే పొండి,’ అన్నట్లు ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బదులిచ్చారు.

నాడు ఐటి కంపెనీలను బెంగళూరు ఆకర్షించడానికి అప్పటి ప్రభుత్వాలు ఏవిదంగా కృషి చేశాయో, ఇప్పుడు ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్‌ కూడా అదేవిదంగా గట్టిగా కృషి చేస్తున్నారు.

కనుక కర్ణాటక నుంచి బయటపడాలనుకుంటున్న ఐటి కంపెనీలకు ఏపీకి ఆహ్వానిస్తున్నారు. బెంగళూరుకి అతి సమీపంలోనే అనంతపురంలో లేదా ఏపీకి ఐటి రాజధానిగా ఎదుగుతున్న విశాఖలోగానీ సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.

ఇది చూసి వెంటనే అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన కర్ణాటక మంత్రులు ఇంకా తల బిరుసుగానే వ్యవహరిస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు) ట్వీట్ ఇందుకు తాజా నిదర్శనం.

సాధారణంగా బలహీనమైన పర్యావరణ వ్యవస్థలు బలమైన వాటి మీద ఆధారపడటం సహజమే. దాంట్లో తప్పేం లేదు. కానీ అది దోపిడీగా మారినప్పుడు, అది బలానికంటే బలహీనతను ఎక్కువగా చూపిస్తుంది… అంటూ ఈ ఏడాదిలో నగరంలో జనాభా, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల అభివృద్ధి, రాబోయే 10 ఏళ్ళలో బెంగళూరు జీడీపీ వృద్ధి రేటు తదితర గణాంకాలు వివరించి దేశంలో అత్యధిక వలస ఉద్యోగులకు ఆశ్రయం కల్పిస్తున్న ఏకైక నగరం బెంగళూరు అని పేర్కొన్నారు.

కానీ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ తమ అభివృద్ధి ఫలాలను కొందరు పరాన్నజీవులా ఆరగించాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది కర్ణాటక మంత్రుల తీరు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నట్లు భావించవచ్చు.

ఏపీలో గత ప్రభుత్వం ఇదేవిదంగా వ్యవహరించినందుకు ఎన్ని ఐటి కంపెనీలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలి పోయాయో అందరికీ తెలుసు. ఇప్పుడు కర్ణాటక మంత్రులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కనుక బెంగళూరులో ఉన్న ఐటి కంపెనీలు, ఇంకా అక్కడ కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్నవి కూడా క్రమంగా ఏపీకి తరలి వచ్చినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories