నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో కొందరు యువకులు నడిరోడ్డుపై యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయగా… ఈ ఘటన చాలా బాధాకరమని అమీర్ ఖాన్ అభివర్ణించారు. ఇటువంటి ఘటనలు జరిగితే అది మనందరికీ, దేశానికే అవమానకరమని, ప్రతి రాష్ట్ర సర్కారు ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
యువతులపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఏమీ జరగదులే అని ఈ కాలపు యువత భావిస్తుందని, ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని అన్నారు. వెంటనే అరెస్ట్ చేస్తుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడడానికి కూడా వారు భయపడతారని అమీర్ ఖాన్ ఆవేదనతో పేర్కొన్నారు. సామాజిక అంశాలపై తన వంతు బాధ్యతగా స్పందించే అమీర్, బెంగుళూరులో జరిగిన విషయం అమానుషమైన చర్యగా అభిప్రాయపడ్డారు.
ప్రముఖ స్క్రిప్ట్ రైటర్, సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కూడా స్పందిస్తూ… యువకులు పాల్పడిన ఈ ఘటన సిగ్గుపడాల్సిన విషయమని, తాము కూడా ఆ వయసు దాటి వచ్చినవారిమే కానీ, ఇటువంటి దారుణ ఘటనలు ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ వెంటనే స్పందించాలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను తెలుపుతూ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



