నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ, సర్క్యులేషన్ రీత్యా కొన్ని నోట్లు ఇప్పటికీ ప్రజల చేతుల్లో తిరుగుతూ ఉంటున్నాయి. అయితే ఇదంతా చలామణి అయ్యేది కేవలం డిసెంబర్ 30 వరకే. ఆ తర్వాత వీటికి అవకాశం ఉండదు. పాత నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానం. దీంతోఅసలు ‘సినిమా’ జనవరిలో కనపడుతుందని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో… కరెన్సీపై కేంద్రం నియంత్రం ఎత్తేస్తుందన్న వార్తలు మీడియా వర్గాల్లో ప్రసారం అవుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇది ఎంతవరకు సాధ్యం అని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే మాత్రం… తెల్లముఖం వేస్తున్న పరిస్థితి నెలకొంది. బహుశా కేంద్రం ఆంక్షలూ ఎత్తివేసి, ఎవరు ఎంత మొత్తం డబ్బు కావాలంటే అంత తీసుకోవచ్చని ప్రకటించినప్పటికీ, అది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతుందని, వాస్తవ పరిస్థితిలో ఇది అసాధ్యం అంటున్నారు బ్యాంకర్లు. కోరుకున్న మొత్తం కాదు కదా… ప్రభుత్వం విధించిన ప్రస్తుత పరిమితి 24 వేలు కూడా చేతికి అందబోదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం తీవ్ర ప్రాధాన్యతను దక్కించుకుంది.
బ్యాంకుల వద్ద డబ్బులు చాలినంత లేవని, కొత్త నోట్లు సరఫరా కావడం లేదని, కొత్త సంవత్సరంలో కొత్త కరెన్సీ కోసం తిప్పలు తప్పబోవని దీని ఆంతర్యం. అధిక మొత్తంలో విత్ డ్రాలకు సమస్యలు తప్పబోవని నిపుణులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ 2 వేల నోట్లను మరింతగా ముద్రించి బ్యాంకులకు అందించినా, వాటిని మార్చుకోవడం కష్టంతో కూడుకొని ఉండటంతో, వాటిని స్వీకరించేందుకు ప్రజలు ఇప్పటికప్పుడు అంగీకరించే పరిస్థితి లేదని భావిస్తున్నారు. దీంతో 2017 వస్తోందంటే… కరెన్సీ కష్టాలు దగ్గరవుతున్నట్లేనని మానసికంగా సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది.



