తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఆఫ్టర్ వైసీపీ…బిఫోర్ వైసీపీ అనేంతలా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదేమో. గతంలో రాజకీయ నాయకుల మధ్య వినిపించే విమర్శలలో హుందా తనం కనిపిస్తే, ఆ విమర్శలకు సమాధానం చెప్పే నేతలలో జవాబుదారీ తనం కనిపించేది.
కానీ వైసీపీ ఆవిర్భావంతో రాజకీయ విమర్శలలో వ్యక్తిగత జీవితాలు నలిగిపోతున్నాయి. అలాగే తమకు సంబంధం లేని రాజకీయాలలోకి మహిళలు చిక్కుకుని తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారు. ఎదుటి వ్యక్తి ప్రత్యర్థి అయితే చాలు ఇక ఆ కుటుంబం మొత్తం రాజకీయ వేదిక మీద విమర్శలను ఎదుర్కోవాల్సిందే అనేలా ఏపీ రాజకీయాల దిశా దశ మార్చేశారు వైసీపీ నేతలు.
వారి విమర్శలలో వినిపించే బూతులు, కనిపించే వెటకారం, వెక్కిరింపులు ఎప్పుడు హద్దులు దాటే ఉంటాయి. వాటికీ తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. తిరుమల తిరుపతి లడ్డు అపచారం విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా సనాతన ధర్మ పరిరక్షణకు వారాహి డిక్లరేషన్ ప్రకటించారు.
పర మతాన్ని గౌరవించుకుంటూ తన మతాన్ని కాపాడుకోవడమే ఈ వారాహి డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు పవన్. అయితే పవన్ ఈ డిక్లరేషన్ ప్రకటించే సమయంలో శ్రీవారి దీక్షలో ఉన్న వస్త్రధారణ లో కనిపించారు. అయితే దీని మీద కూడా వైసీపీ నేతలు తమ వెటకారాన్ని, వెక్కిరింపులను ప్రదర్శిస్తూ పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.
తిరుమల తిరుపతికి కొత్త స్వామి జీ వచ్చారండి, ఆయన పేరు శ్రీ శ్రీ పవనానంద స్వామి అంటూ దీక్షలో ఉన్న శ్రీవారి భక్తుడిని అవమానించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ఆ ఏడూ కొండల వారి సేవలో ఉన్న ఈ భూమన ఇప్పుడు అదే శ్రీవారి మాలాధారణను అవమానించడం ఎంతవరకు ధర్మం.?
గడిచిన దశబ్ద కాలం పాటు పవన్ ను దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు అంటూ హేళన చేసిన వైసీపీ ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. పవన్ ను ఒక స్వామికి గా ఒక పీఠాధిపతిగా చిత్రీకరించే ప్రయత్నం లో పవన్ మీద అదే వెటకారం, అదే వెర్రితనం చూపిస్తుంది.
గత వైసీపీ విధానాలతో విసికెత్తిన ప్రజలు 151 నుంచి వైసీపీ ని 11 కి కట్టడి చేసారు. అయినా వైసీపీ తన బుద్ధి మార్చుకోవడం లేదు. తన తీరు సరిచేసుకోవడం లేదు. వైసీపీ రాజకీయం అంటే వెటకారం..వెక్కిరింపులేనా అంటూ ప్రజలు వైసీపీ నేతలను అసహ్యించుకుంటున్నారు.
పవన్ చేసిన ప్రసంగంలో ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షంగా వాటిని ఎత్తిచూపడం, వాటి పై విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ పవన్ ను టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో స్వామి వారి దీక్షా ధారణను అవమానించడం క్షమించరాని నేరం అవుతుంది.
ఒక మతాన్ని టార్గెట్ చేయడానికి పవన్ ను వాడుకుతున్నారా.? లేక పవన్ ను టార్గెట్ చేయడానికి ఒక మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారా.? అనే డిక్లరేషన్ వైసీపీ నుండి ప్రకటిస్తే వైసీపీ విధానమేమిటో, ఆయా నేతల సిద్ధాంతమేమిటో అందరికి అవగతం అవుతుంది కదా.




