చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఒక్క టిడిపి, వైసీపిల మీదే కాదు… బీజేపీ, జనసేనల మీద కూడా పడుతోంది. దీనిపై టిడిపి, వైసీపి, జనసేన మూడు పార్టీలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి. కానీ ఏపీ బీజేపీ దాని అధిష్టానం ధోరణి వలన ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొక్కుబడిగా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు. అంతకు మించి ఆమె మాట్లాడనీయకుండా ఓ వైపు బీజేపీ అధిష్టానం, మరోవైపు వైసీపి కూడా కట్టడి చేసాయి.
చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించలేదని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యి నెలరోజులు అవుతున్నా వారిరువురూ మౌనంగా ఉండిపోవడం ద్వారా జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారని అందరూ గ్రహించాలి.
బీజేపీ అధిష్టానం ఈవిదంగా వ్యవహరిస్తుండగా, ఆ పార్టీ సీనియర్ నేత సత్యకుమార్ యాదవ్, జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్‌లో ఓ పెద్ద సందేశం పెట్టారు. జగన్ తీసుకొన్న ఈ నిర్ణయాలను కేంద్రానికి ఎందుకు ఆపాదిస్తున్నారు?ఎందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారు?జగన్‌కు తెలియకపోతే ఈ ఆదేశాలు ఇస్తున్న అజ్ఞాతశక్తి ఎవరు? ఈ కేసుల కోసం వందల కోట్ల ప్రజాధానం ధారపోస్తున్న ఆ అపార కుభేరుడు ఎవరు? ఈ వెకిలి మాటలకు, వికృత చేష్టలకు స్క్రిప్ట్ అందిస్తున్న ఆ అజ్ఞాత రచయిత ఎవరు? ఉద్యోగుల, ఉపాధ్యాయుల, ప్రజల సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? అంటూ చాలా ఘాటుగా ప్రశ్నించారు.
సత్యకుమార్ చెప్పినవన్నీ నూటికి నూరు శాతం సత్యాలే. కానీ వీటన్నిటినీ ఆయన తమ అధిష్టానానికే ముందు చెప్పాలి. వారు కాదంటే ఇవన్నీ జరిగి ఉండేవా?



