జగన్ ఐదేళ్ళ పాలన ఏపీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం వంటిది.. ఈ మాట బీజేపీ పెద్దలే అంటున్నారు. మరి జగన్ ఏపీని భ్రష్టు పట్టించేస్తూ అవినీతి, ఆక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది? అనే ప్రశ్న ఎప్పుడూ వినిపిస్తుంటుంది.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు దేశవిదేశాలలో ఐటి ఉద్యోగులు కూడా నిరసనలు తెలిపారు. కానీ మోడీ అమిత్ షాలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. తద్వారా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు వ్యవహరించారని భావించవచ్చు. గతం గతః… ఆ చేదు అనుభవాలన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు, బీజేపీతో పొత్తులు పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రాగలిగారు.
ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గౌరవం, పరపతి రెండూ పెరిగాయి. కానీ ఆక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. మద్యం కుంభకోణం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో, అసలు అవుతాయో లేదో ఎవరికీ తెలీదు.
ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుతూ, “జగన్ చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతాము,” అని అన్నారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా సీబీఐ, ఈడీల విచారణ వేగవంతం చేయాలి కదా? కానీ కేసులు, విచారణ నత్త నడకన సాగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఎందువల్ల? అనే ప్రశ్న వినపడుతూనే ఉంది.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ జరిపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసి అప్పుడే పదిరోజులు. కానీ ఇంతవరకు స్పందించక పోవడాన్ని కాంగ్రెస్ మంత్రులు తప్పు పడుతున్నారు. అయితే ముందుగా తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలు, అవసరాలు, లాభనష్టాల లెక్కలు చూసుకోవాలసి ఉంటుంది. కనుకనే కేసీఆర్‌పై సీబీఐ విచారణకు తొందరపడటం లేదని సర్ధి చెప్పుకోవచ్చు.
కానీ ఏపీలో టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసి ఉంది కదా? కానీ జగన్ కేసుల విషయంలో ఎందుకు ఉపేక్షిస్తోంది? జగన్ కేసులని కేంద్రం ఉపేక్షిస్తున్నప్పుడు, జేపీ నడ్డా ఏపీకి వచ్చి ‘జగన్ అక్రమాలను బయటపెడతాం’ అంటూ హూంకరించడం దేనికి? ఏం ప్రయోజనం?




