ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అంతర్జాతీయ వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. గతంలో వోక్స్ వ్యాగన్ వ్యవహారం ఓ నిదర్శనం కాగా ఇప్పుడు శ్రీలంక పరిస్థితుల గురించి మాట్లాడిన మాటలు మరో తాజా నిదర్శనం.
గతంలో కాంగ్రెస్ హయాంలో ఏపీలో వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టిస్తానని తమ్ముడు లక్షణుడుని వెంటపెట్టుకొని ఆయన జర్మనీ వెళ్ళడం, దానిపై జరిగిన రగడ, ఆ తరువాత మద్యవర్తిత్వ కంపెనీకి ముట్టజెప్పిన ‘11 కోట్లు పోనాయండి…మరేటి సేద్దారి?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు తదితర విషయాలన్నీ బహుశః చాలా మందికి గుర్తుండే ఉంటాయి.
అటువంటి గొప్ప అంతర్జాతీయ అనుభవం కలిగిన మంత్రి బొత్స సత్యనారాయణ, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉందంటూ’ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్‌పై స్పందిస్తూ, “ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం అలవాటైపోయింది. శ్రీలంకలో పటిష్టమైన నాయకత్వం, సరైన విధానాలు లేవు కనుకనే మునిగిపోయింది. కానీ ఏపీలో పటిష్టమైన నాయకత్వం, ఖచ్చితమైన విధానాలు ఉన్నాయి. కనుక ఏపీకి ఎన్నడూ అటువంటి దుస్థితి రాదు,” అని గ్యారెంటీ సర్టిఫికేట్ ఇచ్చారు.
శ్రీలంకకు సరైన విధానాలు లేకపోవడం వలననే మునిగిపోయిందని బొత్స ‘సగం నిజం’ కూడా చెప్పారు. ఏపీలో పటిష్టమైన నాయకత్వం ఉన్నమాట నిజమే. ఏపీ ప్రభుత్వ ‘అప్పు చేసి పప్పు కూడు’ విధానం కూడా అటువంటిదే కదా?వచ్చే ఎన్నికలలో వైసీపీని మళ్ళీ గెలిపించుకొని అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రభుత్వం గత మూడేళ్ళుగా ఎడాపెడా అప్పులు చేస్తూ సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని అప్పులు చేసి మరిన్ని వరాలు ప్రకటించవచ్చు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏదో రోజు శ్రీలంకలాగే దివాళా తీయవచ్చని పవన్ కళ్యాణ్‌తో సహా మేధావులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయితే “కేంద్రప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి కదా?మా ప్రభుత్వం చేస్తే తప్పేమిటి?” అని మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అప్పులు చేసి తెస్తున్న వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పరిశ్రమలు ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తున్నట్లయితే ఎవరూ ఈవిదంగా వేలెత్తి చూపేవారు కారు.
కానీ గోడకేసిన సున్నం తిరిగిరానట్లే సంక్షేమ పధకాలకు ఇస్తున్న వేలకోట్లు తిరిగిరావు. ఒకవేళ వస్తే వైసీపీకి ఓట్ల రూపంలో తిరిగివస్తాయి. రాకపోతే వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంది తప్ప సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆ అప్పులన్నీ తీర్చేసి వెళ్ళరు కదా? కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరికి మిగిలేది ఆ అప్పులు వాటి వడ్డీల భారమే. ఆ భారాన్ని ఇప్పుడు సంక్షేమ పధకాల పొందుతున్నవారితో సహా పొందని రాష్ట్ర ప్రజలే మోయాల్సి ఉంటుంది తప్ప తాము కాదు కనుకనే వైసీపీ నేతలు ఇంత ధీమాగా మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు.



