తెలుగు రాష్ట్రాల ‘కేర్ టేకర్’ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ‘భవిష్యత్’ చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. గజగజ వణికించే చలిలో వేడిపుట్టించాలంటే బాలయ్య బాబు నటన చూడాలి… భగభగలాగే మంటలో కన్నీటి బందువు రాల్చాలన్నా ఆయన నటనే చూడాలంటూ నందమూరి నటసింహం అభినయం గురించి బోయపాటి తనదైన స్టైల్లో తెలిపారు.
తన ‘సింహా’ సినిమాలో ఒక డైలాగ్ ఉందని, ‘చరిత్ర నెలకొల్పాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే’ అన్న డైలాగ్ ను లెజెండ్ సినిమా 1000 రోజులతో నిరూపించారని అన్నారు. అమరావతి ఘన చరిత్ర ప్రతి తెలుగు వాడికీ తెలియాలని ఈ సినిమాను తీస్తున్నారని బోయపాటి చెప్పారు. ఇది వందో సినిమా కాదని, వంద సెంటర్లలో వంద రోజులు ఆడే సినిమా అని చెప్పాడు.
ఇక, ఇదే వేదికపై సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ… కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాలించిన ఐదు వంశాలూ తెలుగు వంశాలేనని, అందులో చివరివాడే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని, శాతవాహనులు పాలించిన 400 సంవత్సరాల్లో 25వ చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని, జీవితంలో ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, అది తల్లి వల్లేనని గుర్తించి, ఆమె పేరును పెట్టుకున్న గొప్ప చక్రవర్తి ఆయన ఒక్కరేనని సిరివెన్నెల తెలిపారు.
32 మంది రాజులను జయించి, వారి ఖడ్గాలను సొంతం చేసుకుని, శాంతి ఖడ్గంగా మార్చిన మహానుభావుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని, ఇంత గొప్ప సినిమాను రూపొందించిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలని, ఎంతో రిస్క్ తీసుకుని క్రిష్ ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించారని, ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగృతమవుతుందని చెప్పిన సిరివెన్నెల… ఈ సినిమా తీయగల ధైర్యం ఒక్క క్రిష్ కు మాత్రమే ఉంటే… ఈ పాత్రను చేయగల ధైర్యం ఒక్క బాలయ్యకు మాత్రమే ఉందని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.



