ఇన్నాళ్లుగా అధికారం పోయి సైలెంట్ గా ఉన్న బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యంమత్రి కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయారు. 2019 ఏపీలో జరిగిన ఎన్నికలలో తన అధికారమనే స్టీరింగ్ తిప్పి తన రహస్య మిత్రుడికి పరోక్ష సాయం అందించారు. అయితే ఇప్పుడు అధికారం చేజారగానే తన సొంత వారికే సాయపడలేని పరిస్థితులలో నిలిచారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, వెంటనే వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనంతోనే రైతుల పంటలు ఎండిపోయాయని, ఇది వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇన్నాళ్లుగా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయానని, ఇక పై అది సాధ్యం కాదని రైతులకు న్యాయం చేసే వరకు మిమ్మల్ని వెంటాడుతాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతుల పంటకు నీళ్లవ్వలేకపోయిరి, కరెంట్ సరిగా సప్లై చేయలేకపోతిరి,పాలన చేతకాని మీకెందుకు అధికారం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి. అధికారం దూరమైన బాధో, కూతురు అరెస్టయిందన్న భయమో, నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రస్టేషనో కానీ 10 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన నేతలా హుందాతనమైన విమర్శలు చేయకుండా, బూతులతో తన అసహనాన్ని వెళ్లగక్కడం మాత్రం కేసీఆర్ స్థాయిని తగ్గించాయనే చెప్పాలి.
చెప్పే మాట వాస్తవమే అయినా చెప్పే విధానం సరిగా లేకుంటే అది ప్రజలకు సరిగా చేరుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఫామ్ హౌస్ పాలన చేసి ఇప్పుడు రైతులతో రాజకీయం మొదలుపెట్టారని, ఇదంతా కూడా తన ఉనికి నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగమే అంటూ కేసీఆర్ విమర్శలకు ప్రతి విమర్శలు చేసున్నారు కాంగ్రెస్ నేతలు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తన పార్టీ నేతలను కాపాడుకునే పనిలో భాగమే కేసీఆర్ రాజకీయాలు. ముఖ్యమంత్రిని, మంత్రులను గౌరవించలేని మీ అహంకారం అధికారం కోల్పోయినా తగ్గలేదా..? ఇప్పుడు మీరు ఉన్నది ప్రతిపక్షంలో సారూ కాస్త గుర్తించండి అంటూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు కౌంటర్ వేస్తున్నారు.




