తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేలలో 10 మంది నేతలు గులాబీ కారు దిగి కాంగ్రెస్ హస్తం పట్టుకున్నారు. దీనితో ఇది రాజ్యంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమంటూ బిఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగి తనకు అనుకూలంగా తీర్పు సాధించుకోగలిగింది.
అలాగే ఆ తీర్పు బిఆర్ఎస్ విజయంగా, రేవంత్ పరాజయంగా ప్రచారం చేసుకుంది. అయితే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కూడా చేజార్చుకోవడంతో ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే ల పై విచారణ, ఆ తదుపరి చర్యలతో బిఆర్ఎస్ కోరుండి కొరివిని తలపైకి తెచ్చుకున్నట్టయ్యింది.
గతంలో ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యే లపై స్పీకర్ అనర్హత వేటు వెయ్యాల్సిందే, వారు రాజీనామా చెయ్యాల్సిందే, ఉపఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ ప్రభుత్వం పై పట్టుబట్టిన బిఆర్ఎస్ జూబ్లీహిల్స్ వంటి పార్టీ బలమైన స్థానాన్ని కూడా జారవిడుచుకోవడంతో ఉపఎన్నికలను చూసి కంగారు పడే పరిస్థితికొచ్చింది.
ఇప్పుడు ఒకవేళ ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ప్రభుత్వం ఉపఎన్నికలకు వెళితే వాటిని తమకు అనుకూలంగా బిఆర్ఎస్ మలచుకోగలదా.? అన్న సందేహాలు పార్టీ ముఖ్యనేతలను సైతం వెంటాడుతున్నాయి. సాధరణంగా ఉపఎన్నికలు అనేవి ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటాయి.
అందునా రేవంత్ సర్కార్ కి ఇంకా మూడేళ్ళ సుదీర్ఘ సమయం ఉంది. ఇటువంటి పరిస్థితులలో స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షానికి ఓటేసే పరిస్థితి ఉంటుందా.? బిఆర్ఎస్ ని గెలిపించేందుకు ముందుకొస్తారా.? అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్ల పై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ నిర్వహించారు.
ఇందులో 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్, పోచారం శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, సంజయ్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ హాజరయ్యారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్ విచారణకు గైర్హారయ్యారు.
ఇక ఈ అంశం మీద విచారణ చేపట్టిన స్పీకర్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ తెలిపారు. అయితే నాడు అనర్హత వేటు మీద పట్టుపట్టిన బిఆర్ఎస్ ఉపఎన్నికల కోసం ఆరాటపడిన కేటీఆర్ ఇప్పుడు ఆ నిర్ణయాన్నీ బలంగా వినిపించగలరా.? అలాగే తన పార్టీని ఓటమి అవమానం నుంచి భయటపడేసి గెలుపు అనే భరోసాను అందించగలరా.?






