గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ ల మధ్య సాగుతున్న పార్టీ ఫిరాయింపు నేతల వ్యవహారం ఒక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో నెగ్గిన కొంతమంది గులాబీ నాయకులు పార్టీ ఓటమితో నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార పార్టీ చేయూత కోరారు.
దీనితో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం, దానం సహా మరికొంతమంది నేతల పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత వేటు వేయాలంటూ కోర్ట్ మెట్లెక్కారు. దీనితో ఇక ఆ తంతు ముగించాల్సి బాధ్యత స్పీకర్ పై పడింది.
దీనితో ఈ అంశం పై దానం, కడియంతో సహా మరి కొంతమంది నేతల పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిపి చివరికి అందరు ఊహించినట్టే వారికీ క్లిన్ చిట్ ఇచ్చారు. అలాగే దానం, కడియం కూడా మేము ఇప్పటికి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కానీ పార్టీ అధిష్టానానికి మాత్రమే దూరమయ్యామంటూ తమ వాదన వినిపిస్తున్నారు.
అయితే ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీకి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తో పోరాడే నైతిక హక్కు ఉందా అనేది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ అధిష్టానం ఎంతమంది ఇతర పార్టీ గుర్తుల మీద గెలిచిన నేతలను గులాబీ కారెక్కించారో మరిచిపోయారా.?
నాడు లేని ఫిరాయింపు చట్టాలు, అనర్హత వేటు వాదనలు నేడు ఎందుకొస్తున్నాయి.? కనీసం ఇప్పటికైనా స్పీకర్ తీర్పు తో బిఆర్ఎస్ శాంతిస్తుందా.? లేదా పోరాటం కంటిన్యూ అంటూ వివాదాన్ని సాగదీస్తుందా.?




