brs-padi-kaushik-reddy

బిఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రాన్ని బయటకు తీసి వాడుకుంటుంది. మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ‘తెలంగాణ బిడ్డ’కి అన్యాయం జరిగిందని వాదించారు.

ఇప్పుడు కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య ‘పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌’ పదవి కోసం కీచులాటలు మొదలైతే, ‘చంద్రబాబు నాయుడు కుట్ర’ అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉంది.

Also Read – టాలీవుడ్‌ హీరోలూ… మీకూ సిన్మా చూపిస్తాం రెడీయా?

“రేవంత్‌ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడి హైడ్రా పేరుతో నగరంలో విధ్వంసం సృష్టిస్తూ, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌ అంటే భయపడి అమరావతికి పారిపోయేలా చేస్తున్నారని” పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించడం ఇంకా విడ్డూరంగా ఉంది.

కేసీఆర్‌ హయాంలో బిఆర్ఎస్ నేతలు, వారి అండదండలతో పలువురు ప్రముఖులు నగరంలో చెరువులు, కాలువలు ఆక్రమించి అపార్ట్‌మెంట్‌లు, ఫామ్‌హౌస్‌లు, విల్లాలు కట్టుకున్నారు. అందుకు ఎన్‌ కన్వెవెన్షన్ ఓ చిన్న ఉదాహరణ.

Also Read – ఆ ఒక్కడి కోసమే ఏదైనా అవుతా..!

ఇంతకాలం పేదల ఇళ్ళే కూల్చడం చూసిన ప్రజలు, తొలిసారిగా రేవంత్‌ రెడ్డి చాలా ధైర్యంగా బాడాబాబుల అక్రమ కట్టడాలను కూల్పించేసి చెరువులు, కాలువలను పునరుద్దరిస్తున్నందుకు హర్షిస్తున్నారు.

అయితే హైడ్రా ఇంతవరకు బిఆర్ఎస్ నేతల ఇళ్ళ జోలికి వెళ్ళలేదు కానీ ఏదో ఓ రోజు హైడ్రా తమ అక్రమ కట్టడాలు కూడా కూల్చివేయడం ఖాయమని బిఆర్ఎస్ నేతలకు తెలుసు. కానీ ఆ మాట బయటకు చెప్పుకోలేక హైడ్రా కూల్చివేతల వెనుక చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తుండటం కేసీఆర్‌ భాషలో… చిల్లర రాజకీయం చేయడమే కదా?

Also Read – సిట్టూ…బిట్టూ వద్దట… ఎందుకు జగన్మావయ్యా?

అయినా చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడటానికి రేవంత్‌ రెడ్డి ఏమీ జగన్‌, కేటీఆర్‌లాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలలోకి, అధికారంలోకి రాలేదు. ఎన్నో ఆటుపోటులు, అంతర్గతంగా ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. కేసీఆర్‌ ధాటికి విలవిలలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు.

జగన్‌ అమరావతి నిర్మించకుండా మూడు రాజధానులంటూ కాలక్షేపం చేస్తారని కేసీఆర్‌కి తెలుసు కనుకనే ఆయనకు తోడ్పడ్డారు. ఒకవేళ కాదనుకుంటే ఆ తర్వాత జగన్‌కి అది తప్పు అని కేసీఆర్‌ నచ్చజెప్పి ఉండవచ్చు. కానీ ఏనాడూ చెప్పలేదు.

ఎందుకంటే అమరావతి నిలిచిపోయి, ఏపీ రాజధాని లేని రాష్ట్రంలో మిగిలిపోతేనే తెలంగాణ, హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మారు. అదే జరిగింది కూడా.

ఇదంతా చంద్రబాబు నాయుడుకి తెలిసి ఉన్నప్పటికీ ఏనాడూ కేసీఆర్‌ని నిందించలేదు. ఎందుకంటే మన బంగారం మంచిది కానప్పుడు ఎవరినో తప్పు పట్టి ఏం ప్రయోజనం?

కానీ స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగిన రేవంత్‌ రెడ్డి చేజేతులా తనకి, తన పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి నష్టం కలిగించుకొని చెడ్డపేరు తెచ్చుకునే అవివేకి కాదు. కనుక ఆయన తన పార్టీకి, తన రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తున్నారు.

కనుక బిఆర్ఎస్ నేతలు హైడ్రాని చూసి భయపడుతున్నారా లేక రేవంత్‌ రెడ్డిని చూశా? అంటే రేవంత్‌ రెడ్డినే అని చెప్పక తప్పదు. ఫామ్‌హౌస్‌ని కూల్చివేస్తే ఆ నష్టాన్ని తట్టుకోగల ఆర్ధిక స్థోమత బిఆర్ఎస్ నేతలకి ఉంది.

కానీ వానర సైన్యం వంటి కాంగ్రెస్‌ నేతలతో అపరచాణక్యుడినని విర్రవీగే కేసీఆర్‌ని ఓడించి ఫామ్‌హౌస్‌ గడప దాటకుండా కూర్చోబెట్టిన రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ కంటే రాజకీయంగా చాలా తెలివినవాడినని నిరూపించుకున్నారు.

అంత తెలివైన వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో స్థిరపడిపోతే ఇక ఎన్నటికీ బిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కి ముఖ్యమంత్రి అవకాశం లభించదనే భయంతోనే బిఆర్ఎస్ నేతలు మళ్ళీ ‘తెలంగాణ సెంటిమెంట్’ బయటకు తీసి వాడేస్తున్నారు.

దాంతో వారు రేవంత్‌ రెడ్డిని ఎదుర్కొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ మద్యలో సిఎం చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపిస్తే మరోసారి తప్పక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి ఇస్తే దానిని భరించడం వారి వల్ల కాకపోవచ్చు. బిఆర్ఎస్‌కి చాతకాక చంద్రబాబుని నిందిస్తే ఎలా?