Budameru canal

విజయవాడ ప్రజలు వరదలలో అల్లాడుతుంటే టిడిపి కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని వైసీపి ప్రశ్నిస్తోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుంటే, బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తుంటే కేవలం 4-5 రోజులలోనే మూడు గండ్లు పూడ్చారు. వాటిలో ఒకటి సుమారు 90 మీటర్లు పొడవునా గండి పడగా, కాంట్రాక్ట్ సంస్థలు, ఆర్మీ జవాన్లు కలిసి దానిని కూడా నేడు పూడ్చివేశారు.

గండ్లు పూడ్చివేతపనులు జరిగిన నాలుగు రోజులూ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు చేయించారు. గండ్లు పూడ్చివేతకు అవసరమైన సామాగ్రి, వాహనాలు, సిబ్బంది వగైరా ఏర్పాట్లన్నీ మంత్రి నారా లోకేష్‌ చూసుకున్నారు. ఇద్దరు మంత్రులు సమన్వయంతో పనిచేస్తూ4-5 రోజులలోనే మూడు పెద్ద గండ్లు, మరో 4-5 చిన్నవి పూడ్పించారు.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

ఈ రోజు మధ్యాహ్నం మూడవ గండి కూడా పూడ్చివేయడంతో బుడమేరు నుంచి విజయవాడ వైపు వరద నీటి ప్రవాహం నిలిచిపోయి డైవర్షన్ కెనాల్ గుండా కృష్ణా నదిలోకి వెళ్ళిపోతోంది. విజయవాడ లోతట్టు ప్రాంతాలలో ఇంకా ఎక్కడైనా నీళ్ళు మిగిలిపోతే వాటిని పంపులు పెట్టి తోడించేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ 4-5 రోజులలోనే కన్నయ్య నాయుడు అధ్వర్యంలో దెబ్బ తిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమత్తు పనులు కూడా పూర్తి చేశారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడే బ్యారేజీలోని 67,69 గేట్ల కౌంటర్ వెయిట్స్ అమర్చారు. కృష్ణానదిలో మూడు మరబోట్లు కొట్టుకు వచ్చి గేట్లని ఢీకొనడంతో కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నాయి. దాంతో గేట్లు పైకి, కిందకి కదిలించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దెబ్బ తిన్న రెండు గేట్లకు మరమత్తులు పూర్తవడంతో వాటిని మూసేసి అడ్డంగా ఉన్న బోట్లను అక్కడి నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…

వరద ముంచెత్తిన మర్నాటి నుంచే సుమారు 2-3 లక్షల మందికి మంచినీళ్లు, ఆహారం అందించారు. కేవలం 4-5 రోజులలోనే వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాలనీలు, ఇళ్ళు శుభ్రం చేశారు. దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థని పూర్తిగా పునరుద్దరించారు.

గేట్లు మరమత్తులు పూర్తి చేశారు. బుడమేరు గండ్లు పూడ్చేశారు. జగన్‌ ప్రభుత్వం ఏనాడైనా ఇంత చురుకుగా సమర్ధంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా?అని వైసీపి నేతలు ఓసారి ఆలోచించుకుంటే టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఈవిదంగా ఎవరూ వేలెత్తి చూపరు.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..