ఈసారి మేమే… ఓకే! రోడ్‌మ్యాప్ ఉందా?

Can BJP Really Win Power in Telangana This Time?

ఈసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ అది అంత సులువు కాదని అందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్ తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణేనని ప్రధాని మోదీ చెప్పి వెళ్లారు.

అప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా ముఖ్య నేతలు అదే పాట పాడుతున్నారు. కానీ మోదీ భజన చేస్తూ, ‘ఈసారి మేమే’ అని పాట పాడుతుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదా? అంటే రాదనే చెప్పవచ్చు.

ADVERTISEMENT

పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దాదాపు పదిహేనేళ్లు చాలా కష్టపడింది. ఆ ప్రయత్నంలో గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మించుకొని బలోపేతం చేసుకోవడం మొదలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా చిత్తు చేసేవరకు రకరకాల వ్యూహాలు అమలుచేస్తూ చివరికి విజయం సాధించింది.

తెలంగాణలో మొదటి నుంచి బీజేపీ బలంగానే ఉంది. క్రమంగా బలపడుతూనే ఉంది. కానీ 12 ఏళ్లలో బీజేపీ సాధించిన దానికంటే కాంగ్రెస్ పార్టీ సాధించింది స్పష్టంగా కనిపిస్తోంది.

రెండు సీట్లతో మొదలుపెట్టి 8 ఎంపీ సీట్లు గెలుచుకునే వరకు ఎదిగామని తెలంగాణ బీజేపీ గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఇదే స్పీడుతో సాగుతుంటే మరో 10-15 ఏళ్ల తర్వాతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదు.

తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకునే ముందు, ఏవిధంగా వస్తామో కూడా చెప్పుకోగలిగితే బాగుంటుంది. కానీ చెప్పలేని పరిస్థితి.

కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? కనీసం వారి మధ్య ఐక్యత కనిపించదు.

తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు నలుగురు ప్రధాన నాయకులున్నారు. కానీ నలుగురూ ఏనాడూ ఒకే వేదికపై కనిపించరు. అంటే వారి మధ్య సయోధ్య లేదనే సంకేతం పంపుతున్నట్లే కదా?

కనుక ముందుగా సీనియర్ నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించుకొని నలుగురూ కలిసి పనిచేయడం మొదలుపెడితే అప్పుడు ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అనే మాట నమ్మకంగా చెప్పుకోగలుగుతారు.

అలాగే బీజేపీ-బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని, వచ్చే ఎన్నికలలో అవి కలిసి పోటీ చేయవచ్చని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తాజాగా తెలంగాణలో జనసేన కూడా సై అంటోంది. కనుక ఈ రెండు పార్టీల విషయంలో బీజేపీ వైఖరి ఏమిటనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా ‘ఈసారి మేమే’ అని పాట పాడుకుంటే బీజేపీయే నష్టపోతుంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల నమ్మకం పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరి తెలంగాణ బీజేపీ నేతలు ప్రజల నమ్మకం పొందేందుకు ఏం చేస్తున్నారో చెప్పగలరా? ప్రజల నమ్మకం పొందకుండా ‘ఈసారి మేమే’ అంటే అది రొటీన్ పాటగానే మిగిలిపోతుంది అని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories