కవిత విపక్షానికొస్తే .. బిఆర్ఎస్ – బీజేపీ లు.?

Kavitha Political Comeback

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు బిఆర్ఎస్ ఓటమితో కవిత రంగ ప్రవేశం చేసారు. తెలంగాణ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టుకునే ప్రతిపక్షం లేకపోవడమే కాంగ్రెస్ గెలుపు కి మార్గం సులభం చేస్తుందంటూ కవిత విపక్ష పాత్రకు సిద్డమయ్యారు.

అలాగే బిఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు పై తానూ చేసిన ఆరోపణలకు, విమర్శలకు స్వయంగా హరీషే బదులివ్వాలి కానీ ఇతరుల చేత తిట్టించడం ఎందుకు అంటూ మరోసారి హరీష్ టార్గెట్ గా బాణాలు సంధించారు.

ADVERTISEMENT

అయితే ఖమ్మం జిల్లా జనం బాట కార్యక్రమంలో ఉన్న కవిత విపక్షంగా బిఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందినట్టు ఆరోపిస్తున్నప్పటికీ బిఆర్ఎస్ నుంచి కవిత ఆరోపణలకు తగ్గ సరైన సమాధానం మాత్రం రాలేకపోతుంది.

జూబ్లీహిల్స్ ఓటమి కేటీఆర్ నయాకత్వానికి సవాల్ గా మారిన వేళ కవిత చేస్తున్న ఈ విమర్శలు పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేయనున్నాయి. అయినా కూడా అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ కవిత పట్ల ఇంకా “మౌనం అనే అస్త్రాన్ని అడ్డుపెట్టుతున్నారే తప్ప విమర్శ అనే ఆయుధాన్ని ఎక్కుపెట్టలేకపోతున్నారు”.

అయితే కాంగ్రెస్ కు ఇక ప్రత్యామ్నాయం మేమే అంటూ కవిత జాగృతి పేరును హై లైట్ చేయడం, తన ప్రాధాన్యతను పెంచుకోవడం వెనుక ఉన్న అంతరార్ధం తెలంగాణలో బీజేపీ ఉనికి లేనట్టా.? బిఆర్ఎస్ పట్టు కోల్పోయినట్టా.? కేసీఆర్, కేటీఆర్ లను కాదని, బీజేపీ ని పక్కన పెట్టి తెలంగాణ సమాజం రాజకీయంగా కవిత వైపు నిలబడుతుందా.?

కవిత బిఆర్ఎస్ కు దూరంగా ఒంటరిగా రాజకీయం మొదలు పెట్టిన ఈ సమయంలో కనీసం తెలంగాణ రాజకీయాలలో ప్రజలకు, అక్కడి రాజకీయాలకు సుపరిచితుడైన ఏ ఒక్క నాయకుడైన కవిత కు రాజకీయంగా అండగా నిలిచారా.? జాగృతితో కలిసి నడిసారా.?

అటువంటి కవిత, కవిత జాగృతి బిఆర్ఎస్, బీజేపీ లను వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో సరిసమానంగా ఢీ కొట్టగలవా.? కవిత రాజకీయ ఆరోపణలు, విమర్శలు బిఆర్ఎస్ ను రెచ్చకొట్టేందుకు, బీజేపీ లో చలనం తెచ్చేందుకు తోడ్పడతాయే తప్ప కవిత ఒంటరి రాజకీయ ప్రయాణానికి తోడుగా నిలవలేవు.

ఇప్పటికే ఆ విషయాన్ని ఎందరో ప్రముఖ రాజకీయ వాదులు నిరూపించారు కూడా. గతంలో కేసీఆర్ తో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమరంలో చేయి చేయి కలిపి అడుగులో అడుగేసిన ప్రొపెసర్ కోదండరాం సైతం సొంత పార్టీ స్థాపనతో తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ చూపించాలని ఆశ పడినప్పటికీ ఆ ఆశ కాంగ్రెస్ తో పొత్తు కి ఒక ఎమ్మెల్యే పదవికి సరితూగింది.

ఇక షర్మిల సైతం టి. వైసీపీ తో పాదయాత్రలు చేసి తన పార్టీ బలోపేతానికి బిఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాట యాత్రలకు సిద్దమయ్యింది, చివరికి కాంగ్రెస్ లో విలీనంతో షర్మిల పార్టీ తెలంగాణలో సమాదయ్యింది, ఏపీ రాజకీయాలతో షర్మిల రాజకీయానికి ఒక పునాది లేకుండా పోయింది.

మరి కవిత ప్రయాణం కూడా విలీనంతో సరిపెట్టుకుంటుందా.? లేక ఏదైనా పదవితో సరితూగుతుందా.? అనేది కాలమే బదులు చెప్పాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రత్యమ్నాయం నేనే, జాగృతి అంటూ కవిత కలలు కనడమే సుమీ..!

ADVERTISEMENT
Latest Stories