
ఏపీతో పోలిస్తే తెలంగాణలో కుల రాజకీయాలు కాస్త తక్కువే. కానీ కులాలతోనే రాజకీయాలను మరింత సులువుగా శాశించవచ్చని పసిగట్టిన మాజీ సిఎం కేసీఆర్ కులరాజకీయాలకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన ప్రయత్నాలు పూర్తికాకముందే రేవంత్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడి గద్దె దించేశారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో సమగ్ర కులగణన చేయించారు. తెలంగాణ శాసనసభలో నిన్న దానిపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “యావత్ దేశానికే మనం ఆదర్శంగా నిలిచాము. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో ప్రజలు కూడా కులగణన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తారు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?
అయితే ఆ నివేదికని ప్రతిపక్షాలతో పాటు బీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కనుక కులగణనతో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ బీజేపి, బిఆర్ఎస్ పార్టీలపై పైచేయి సాధించాలని రేవంత్ రెడ్డి అనుకుంటే సొంత పార్టీలోనే పొగలు, సెగలు మొదలయ్యాయి. తెలంగాణలో వివిద పార్టీల బీసీ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యి త్వరలో దశల వారీగా ఉద్యమాలు చేద్దామని నిర్ణయించుకున్నారు.
కులగణన అంటే తేనెతుట్టెని కదపడమే అని తెలంగాణలో కనిపిస్తుండగా రేవంత్ రెడ్డి స్పూర్తితో సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో కుల గణన చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
ఏపీతో పోలిస్తే తెలంగాణలో కుల సంఘాలు అంత చైతన్యంగా ఉండవు. అయినప్పటికీ బీసీ కులాల నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో యుద్ధానికి సిద్దం అవుతున్నారు.
ఏపీలో కుల సంఘాలు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఏపీ రాజకీయాలపై కులాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
ఒకవేళ ఏపీ ప్రభుత్వం ధైర్యం చేసి కులగణన సర్వే చేయించినా వైసీపీ చూస్తూ ఊరుకోదు. దానినే బ్రహ్మాస్త్రంగా కూటమి ప్రభుత్వంపైకి ప్రయోగించేందుకు తప్పక ప్రయత్నిస్తుంది.
వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానులు పేరుతో ప్రాంతీయ విభేధాలు సృష్టించేందుకు వెనుకాడని వైసీపీ కులాల మద్య కార్చిచ్చు రగిలించకుండా ఉంటుందా?
కులగణనకు ఏపీ ప్రజలు సహకరించినా కూటమి ప్రభుత్వానికి వైసీపీ సమస్యలు సృష్టించే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకవేళ ముందుకు సాగాలనుకుంటే చాలా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.