విదేశానికి సాగనంపి ఇప్పుడు కోర్టుకెక్కితే…

CBI questions Jaganmohan Reddy’s foreign trip approval in Hyderabad court

సామాన్య ప్రజలు మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల వరకు నిత్యం విదేశాలకు వెళుతుంటూనే ఉంటారు. వారు వెళ్ళేందుకు పాస్ పోర్టు, వీసా ఉంటే సరిపోతుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి కావడం చాలా అవమానకరమే. కానీ అలాంటి వాటిని ఆయన పట్టించుకుంటే రాజకీయాలలో ఉండలేరు.

జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళారు. సుమారు రెండు వారాలు విదేశాలలో గడిపి తిరిగి వస్తారు. ఇందులో విచిత్రమేమీ లేదు.

ADVERTISEMENT

కానీ ఆయన సమర్పించిన వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విదేశీ పర్యటనకు అనుమతించిన సీబీఐ, ఇప్పుడు అయన ఇచ్చిన ఫోన్‌ నంబర్ ఆయనది కాదని గ్రహించింది. కనుక తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందినందుకు సీబీఐ కోర్టు విదేశీ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ వేసింది.

దీనిని విచారణకు స్వీకరించిన హైదరాబాద్‌ సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌ తరపు న్యాయవాది జి.అశోక్ రెడ్డిని ఆదేశించింది.

ఇక్కడ రెండు అంశాలు చెప్పుకోవలసి ఉంటుంది. 1. ఈ తప్పుని సీబీఐ ముందుగా గుర్తించకపోవడం, 2. జరిగిన పొరపాటు చాటింపు వేసుకోవడం, 3. బెయిల్‌ షరతు ఉల్లంఘన.

జగన్‌ విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రతీసారి సీబీఐ అభ్యంతరం చెపుతుంటుంది. కానీ అందుకు బలమైన కారణం ఏమీ చూపదు. కనుకనే కోర్టు అనుమతిస్తుంటుంది. ఈసారి జగన్‌ వేరే ఫోన్‌ నంబర్ ఇచ్చారనే విషయం ఆయన విదేశానికి వెళ్ళిన తర్వాత కానీ సీబీఐ గుర్తించలేదు.

గుర్తించి కోర్టులో పిటిషన్‌ వేస్తే అందరూ సీబీఐనే తప్పు పడతారు. కనుక మరో పది రోజులు మౌనంగా ఊరుకుంటే జగన్‌ తిరిగొచ్చేసేవారు. అక్కడితో ఇది ముగిసిపోయేది. మరోసారి అనుమతి కోరినప్పుడు ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడితే సరిపోయేది. కానీ కోర్టుకెక్కడంతో జరిగిన పొరపాటుని స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది.

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తే ఏమవుతుందో బాగా తెలుసు. కానీ నిబందనల ప్రకారం తన సొంత ఫోన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉండగా వేరేది ఇచ్చారు. అది అయన పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే వ్యక్తి పేరుతో ఉంటేనే సమస్య మొదలవుతుంది.

అప్పుడు విదేశీ పర్యటన అనుమతి రద్దుతో ఈ కధ ముగియదు… కొత్త కధ మొదలవుతుంది. ఒకవేళ ఈ పాయింట్‌తో సీబీఐ ఆయన బెయిల్‌ రద్దు చేయమని కోరితే ఆయనే ఇబ్బంది పడతారు.

ఇలాంటి చిన్న సమస్యని కొమ్ములు తిరిగిన ఆయన న్యాయవాదులు అవలీలగా చేదించగలరు. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ సమస్య సృష్టించుకోకపోతే ఈ న్యాయపోరాటం అవసరం ఉండేది కాదు కదా? మీడియాలో ఇటువంటి వార్తలు వచ్చేవి కావు కదా?

ADVERTISEMENT
Latest Stories