ఒక్క విపత్తు లక్షలాది మంది జీవితాలను చిదిరం చేసింది, వేలాదిమందిని నిరాశ్రయులుగా మిగిల్చింది, వందలాదిమందికి ఆకలి బాధను రుచి చూపించింది, పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. అయితే ప్రకృతి ప్రకోపానికి రాజకీయ నాయకులను నిందించడం కంటే తమవంతు బాధ్యతగా ప్రజలకు అండగా ప్రభుత్వానికి సాయంగా మానవత్వం కలిగిన ప్రతి వారు అడుగు ముందుకేస్తున్నారు.
ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుంచి తొలి అడుగు పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ప్రకృతి ప్రళయానికి స్పందించిన సెలబ్రేటిస్ ఈ విపత్తు పై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, వరద బాధిత ప్రాంతాలను చూస్తుంటే గుండె కలిచి వేస్తుందని, జరిగిన నష్టాన్ని డబ్బుతో పూడ్చలేనిది కానీ బాధితులకు, ప్రభుత్వానికి ఒక చేయూతగా ఉంటుందనే ఉద్దేశంతో మావంతుగా ఈ చిరు సాయం అంటూ వారి పేద మనస్సు చాటుకుంటున్నారు.
Also Read – కేజ్రీవాల్ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!
ప్రజలను ఆదుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ముందుగా తారక్ ఏపీకి 50 లక్షలు తెలంగాణకు 50 లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 5 లక్షలు, సిద్దు జొన్నల గడ్డ ఏపీకి 15 లక్షలు, టీజీ కి 15 లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోటి రూపాయిలు విరాళం ప్రకటించగా సూపర్ స్టార్ మహేష్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు గాను చెరో 50 లక్షల చప్పున ప్రకటించారు. ఇక వైసీపీ పార్టీ తరుపున వైస్ జగన్ కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ కోటి రూపాయిలు ఏ రూపంలో బాధితులకు అందించాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అంటూ వెల్లడించారు.
Also Read – అతితెలివి ప్రదర్శించినా జగన్ దొరికిపోయారుగా!
అలాగే హీరో సందీప్ కిషన్ వరద బాధితుల సహాయార్థం తన టీం ను విజయవాడ కు పంపి బాధితులకు ఆహారం అందించారు. ఈ కోవలోనే “M9” తరుపున రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్ కు మా వంతు బాధ్యతగా “2లక్షల రూపాయిలు” విరాళముగా ప్రకటించడం జరిగింది.
అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు, వ్యాపారస్తులు కూడా తమవంతు బాధ్యతగా బాధితులకు అండగా ఉండడానికి ప్రభుత్వానికి తమ ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం, ఇది మన బాధ్యత అంటూ ప్రతిఒక్కరు కష్టానికి కాపు కాసి చేయందిస్తే ప్రళయం కూడా ప్రవాహంలా మారిపోతుంది.
Also Read – వందే భారత్‌కి ప్రధాని పచ్చ జెండాలు ఇంకెంత కాలం?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం తరుపున తాము చేయగలిగినదంతా చేస్తున్నామని, ఇటువంటి ప్రకృతి ప్రళయాలను ఎదుర్కొని తిరిగి సాధారణ పరిస్థితికి రావడానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా తమ శక్తి మేరకు ప్రతి కుటుంబం ఎంతోకంత బాధిత కుటుంబాలకు మానవతా ధృక్పదంతో సాయమందించాలని పిలుపునిచ్చారు.