ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో పొరుగు రాష్ట్ర శాసనసభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన ఓ విషయం ప్రస్తావించారు.
నాడు తాను సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక ఏ ఇజం లేదు ఉన్నదంతా టూరిజం మాత్రమేనంటే తమకు చాలా కోపం వచ్చేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారని, కానీ నాడు తాను చెప్పిన ఆ మాటలు అర్దం చేసుకోవడానికి 30 ఏళ్ళు పట్టిందని కూనంనేని స్వయంగా మొన్న శాసనసభలో చెప్పారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
అయితే ఇప్పుడు అర్దం చేసుకోవడానికి మనకి మరో 30 ఏళ్ళు కావాలంటే కష్టమని సిఎం చంద్రబాబు నాయుడు నవ్వుతూ అన్నారు. పర్యాటక రంగాన్ని తేలికగా తీసుకోవద్దనే దానికి ప్రభుత్వం పరిశ్రమ హోదా కల్పించి, దాని అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసిందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు నెల్లూరు వరకు రాష్ట్రంలో అనేకానేకపర్యాటక ఆకర్షణ కేంద్రాలున్నాయని, వాటిలో సముద్రతీరాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు దేనికదే సాటి కనుక ఆ లెక్కనే ఆయా జిల్లాలకు అనుగుణంగా పర్యాటక రంగం అభివృద్ధికి విధివిధానాలు రూపొందించుకొని ముందుకు సాగాలని సిఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పాలసీని ప్రకటించిన తర్వాత ఈ రంగంలో తొలిసారిగా రాష్ట్రానికి రూ.1,217 కోట్లు పెట్టుబడులు వచ్చాయి కూడా.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అందరూ పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో కాస్త శ్రద్ధ చూపితే, పర్యాటక రంగం ద్వారానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం, అనేకమందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు కూడా లభిస్తాయి.




