వనరులు లేవని అనుకున్నప్పుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని, సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలెందుకు విభజించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవమని, నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మరోసారి స్పష్టం చేసారు. ఎంపీలు, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ తరువాత పార్టీ ఎలా అడుగులు వేయాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చించిన మీదట, మీడియా మాట్లాడారు చంద్రబాబు.
మంత్రులు, ఎంపీలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందాన్ని సోమవారమే ఢిల్లీకి పంపనున్నామని, రాష్ట్ర అవసరాలపై కేంద్రానికి ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. నాడు విభజనకు అన్ని పార్టీలు ఎలా అంగీకరించాయో, విభజన చట్టంతో పాటు ప్రత్యేక హోదాకు కూడా అంతే స్థాయిలో పార్లమెంటు సాక్షిగా మద్దతు ఇచ్చాయని గుర్తు చేసారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసిన చంద్రబాబు, ప్రజల సెంటిమెంటుతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం తమకు గానీ, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కానే కాదని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలుపుతామని అన్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు కలిసికట్టుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి వుందని, అందుకు ప్రత్యేక హోదాతో పాటు అదనపు నిధులను, పన్ను రాయితీలనూ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని తాను మొదటి నుంచే చెప్తూనే ఉన్నానని, ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. నాడు అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు అర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెప్తారు? ఆర్థిక సంఘం ఉందన్న విషయం నాడు గుర్తుకు రాలేదా? అని అడిగిన చంద్రబాబు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోమని… టిడిపి – బిజెపిల మైత్రి విషయమై పరోక్షంగా ‘హింట్’ ఇచ్చారు.



