సిఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికరమైన విషయం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ముందు తమ ఇగోలు.. .ఆటిట్యూడ్‌లు వదులుకొని చిన్నాపెద్దా తేడా చూడకుండా అందరితో కలిసిమెలిసి పని చేయడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ ఒక్క మాట చెప్పి ఊరుకుంటే ఎవరూ దానిని పెద్దగా పట్టించుకునేవారే కారు. కానీ దీనికో చక్కని ఉదాహరణ కూడా చెప్పారు.
“సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ రోజు నా సెక్రెటరీ వచ్చి ఓ ‘నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ’ ప్రతినిధులు ఇండియాకి వస్తున్నారు. ఏం చేయమంటారు?అని అడిగితే నేనే వారికి ఫోన్ చేసి మాట్లాడాను.
వారు మా లిస్టులో ముంబయి, చెన్నై, బెంగళూరు మూడు నగరాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ వచ్చి ఏం చేయాలని అడిగారు. నాతో ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా? అంటే అందుకు వారు అంగీకరించి హైదరాబాద్ వచ్చారు.
నేను నలుగురు మంత్రులను, ఉన్నతాధికారులను విమానాశ్రయం పంపించాను. వారిని సాదరంగా ఆహ్వానించి సిఎంవోకి తీసుకువచ్చినప్పుడు నేను వారికి ఎదురేగి శాలువాలు కప్పి కాసేపు మాట్లాడాను.
మీరు వెళ్ళే మూడు రాష్ట్రాలలో వారు మీకు ఏం ఆఫర్ ఇస్తే దానికి మరొకటి కలిపి ఇస్తానని చెప్పి సాగనంపాను. వారు మూడు రాష్ట్రాలకు వెళ్ళారు. కానీ సంతృప్తి కలగలేదు. హైదరాబాద్‌నే ఫైనల్ చేశారు. అలా వచ్చిందే ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.’
ఆరోజు నేను ముఖ్యమంత్రిని… నేనెందుకు వాళ్ళకు ఫోన్ చేయాలి?నేనెందుకు వాళ్ళని బ్రతిమాలుకోవాలి?నాకా అవసరం ఏముంది? అని అనుకొని ఉంటే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ హైదరాబాద్‌కి వచ్చి ఉండేదా? కనుక ఎవరైనాసరే ఈ ఇగోలు, ఆటిట్యూడ్‌లు వదులుకొని పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి,” అని సిఎం చంద్రబాబు నాయుడు వివరించారు. నిజమే కదా!
కానీ గల్లీ స్థాయి లీడర్లు మొదలు ఆఫీసులో గుమాస్తాలు, అధికారుల వరకు అందరికీ ఇగోలు..ఆటిట్యూడ్‌లే! సామాన్య ప్రజలంటే ఖాతరే చేయరు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సరేసరి! వెనక వందిమాగదులతో రాజు వెడలె రావితేజంబులరియగ… అన్నట్లు తిరుగుతుంటారు. ఇగోలు..ఆటిట్యూడ్‌లే వారి కవచ కుండలాలు… వారేమీ దానకర్ణులు కారు వాటిని వదులుకోవడానికి!
కానీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ మంచి మాట ఒక్కరు చెవి కెక్కించుకున్నా చాలు!
నేను కూడా ముఖ్యమంత్రిని అని ఆరోజుల్లో ఆటిట్యూడ్,ఇగోలు చూపించి ఉంటే హైదరాబాద్ కి ISB(INDIAN SCHOOL OF BUSINESS)వచ్చేది కాదు..
మంత్రులు కలెక్టర్లు మొదట మీ ఆటిట్యూడ్,ఇగో తగ్గించుకుని పని చేయండి
– సీఎం చంద్రబాబు గారు #narachandrababu pic.twitter.com/DbcHE8WBKz
— మన ప్రకాశం (@mana_Prakasam) March 13, 2026




