తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘విశ్వనగరం’ హైదరాబాద్ ను పూర్తిగా వదిలేసేందుకే నిర్ణయించుకున్నట్లున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ ను నివాసంగా మార్చుకున్న బాబు గారు, విజయవాడ నుంచి పాలనను సాగిస్తున్నారు.
తాజాగా తన ఆధార్ కార్డులోని చిరునామాను మార్చేయాలని ఉండవల్లి గ్రామ పంచాయతీ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు ఏపీ సిఎం. ప్రస్తుతం తన ఆధార్ కార్డులోని హైదరాబాద్ చిరునామాకు బదులుగా ఉండవల్లి అడ్రెస్ ను చేర్చాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు తాడేపల్లి మండల అధికారులు కూడా చర్యలు చేపట్టారు. పనిలో పనిగా ఓటరు కార్డులోని తన హైదరాబాద్ చిరునామాను కూడా మార్చేసి ఉండవల్లి అడ్రెస్ నే చేర్చాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.
ఇదే జరిగితే… ఇకపై హైదరాబాద్ లో చంద్రబాబుకు ఓటు హక్కు ఉండదు. తను తీర్చిదిద్దిన హైదరాబాద్ సామ్రాజ్యంలో కేవలం ఒక పర్యాటకుడిగానే చంద్రబాబు చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.



