చంద్రబాబు నాయుడు కూడా కొడుకు నారా లోకేష్ స్పూర్తితో నెల్లూరులో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్ళ వద్ద సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు! ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా? #SelfieChallengeToJagan “ అంటూ సవాల్ విసిరారు.
తమ హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.61 లక్షల టిడ్కో ఇళ్ళు నిర్మించామని, వాటికి వైసీపీ రంగులు వేసుకొన్నారే గానీ ఇంతవరకు లబ్ధిదారులకు పంచిపెట్టలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 300 చ.అడుగుల ఇంటికోసం రూ.500 చొప్పున, 365 చ.అడుగుల ఇంటికోసం రూ.50,000 చొప్పున, 400 చ.అడుగుల ఇంటికోసం లబ్ధిదారులు చెల్లించిన లక్ష చొప్పున లబ్దిదారులు చెల్లించారు.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రికాగానే వాటి కోసం లబ్ధిదారులు చెల్లించిన సొమ్ములో సగం వాపసు ఇస్తామని, రూ.500 చెల్లించిన లబ్ధిదారులకు రూ.499 వాపసు చేసి కేవలం ఒక్క రూపాయికే ఇళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ వారికి ఆ సొమ్ము చెల్లించలేదు. లబ్ధిదారులకు ఆ ఇళ్ళను అప్పగించలేదు!
దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్ళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇళ్ళ పరిసర ప్రాంతాలలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఇళ్ళలో బిగించిన కిటికీలు తలుపులు వగైరా దొంగతనం అవుతున్నాయి. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ ఇళ్ళను లబ్ధిదారులకు అప్పగించకుండా ప్రభుత్వం ఎందుకు పెట్టుకొని కూర్చోందని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఉందా?



