శాసనసభ ఎన్నికలలో వైసీపి అనూహ్యంగా ఓడిపోవడంతో దాని అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపం, ఆందోళనతో చాలా రోజులు ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టలేదు.
విజయవాడ వరదలలో మోకాలి లోతు నీళ్ళలో నిలబడి ఫోటోలు దిగి ‘బుడమేరు గేట్లు… చంద్రబాబు నాయుడు ఇల్లు’ అంటూ విమర్శలు గుప్పించి నవ్వులపాలయ్యారే తప్ప ఏమీ సాధించలేకపోయారు.
ఆ తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ ప్రయత్నం, ప్రమేయం లేకుండానే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.
అదేదో సినిమాలో హీరో “నా పేరుని కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో…” తలుచుకున్నా చాలనుకుని సంతోషపడిన్నట్లే, మంచిగానో చెడ్డగానో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసినందుకు చంద్రబాబు నాయుడుకి జగన్ ఎంతైనా ఋణపడి ఉండాల్సిందే. ఇప్పుడు దేశంలో జగన్ అంటే తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు!
అయితే టిడిపి, జనసేన, బీజేపీల రుణం అంతటితో తీరిపోయేది కాదు. జగన్ ‘తిరుమలకి వెళ్తా’ అని ఒక్క ముక్క చెప్పగానే మూడు పార్టీలు చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జగన్ తిరుమల పర్యటనపై వైసీపి చేసిన హడావుడి చాలా తక్కువే.
కానీ దేవరలో జూ.ఎన్టీఆర్‌కి ఎలివేషన్స్ ఇచ్చిన్నట్లు గత రెండు రోజులుగా మూడు పార్టీలు, వాటి మద్దతుదారులు జగన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్‌తో ఆయనకి ఫ్రీ పబ్లిసిటీ లభించడమే కాదు… వైసీపి నేతలందరికీ మళ్ళీ చాలా ధైర్యం వచ్చేసింది.
అందుకే ఇంతకాలం ఎర్ర డైరీ భయం కలుగుల్లో దాకొన్న కొడాలి నాని వంటివారు సైతం బయటకు వచ్చి మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపుతూ విమర్శిస్తున్నారు.
చివరిగా చెప్పుకోవలసిన మాట ఒకటుంది. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపెట్టి సిఎం చంద్రబాబు నాయుడు భారీ గోల్స్ సాధించగా, తిరుమల పర్యటన పేరుతో జగన్ ప్యాలస్‌లో నుంచి కాలు బయట పెట్టకుండానే భారీ గోల్స్ చేశారు. దీంతో వైసీపిలో మళ్ళీ నూతనోత్సాహం కనిపిస్తోంది.
కనుక ఓవర్ ఆల్‌గా చూస్తే చంద్రబాబు నాయుడు-జగన్మోహన్ రెడ్డి మద్య జరిగిన ఈ మ్యాచ్ డ్రా అయిన్నట్లే చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ డ్రా అయ్యేందుకు టిడిపి, జనసేన, బీజేపీలే జగన్‌కి తోడ్పడటం విశేషం. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా జగన్ ప్రెస్‌మీట్ పెట్టి పెనాల్టీ కిక్ కొట్టాలనుకుంటున్నారు.




