ఎన్ని విమర్శలు వచ్చినా… ఎంతగా తన మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించినా… పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో జగన్ ఏ మాత్రం సఫలీకృతం కాకపోగా, తన నేతల నుండే అంతర్గతంగా విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటికీ పట్టిసీమను విమర్శించడం ఆపని వైసీపీ అధినేత జగన్ కు, త్వరలోనే చంద్రబాబు మరో పట్టిసీమను అందించడానికి సిద్ధమవుతున్నారు.
రికార్డు స్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం వద్ద ‘పట్టిసీమ’ పేరిట ఓ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి… గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపి దేశంలోనే మొదటిసారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు… తాజాగా పోలవరం ప్రాజెక్టునే ఆధారంగా చేసుకుని… పోలవరం ఎడమ కాలువపై తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద పట్టిసీమ తరహాలోనే మరో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో పర్యటించిన ఇంజనీరింగ్ అధికారులు ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1,300 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా కూడా వేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏలేరు రిజర్వాయర్ లోని నీటి మళ్లింపునకు ఓ ఎత్తిపోతల పథకం, మళ్లీ అక్కడి నుంచి ఏలేరు ఆయకట్టుకు సాగు నీరు, విశాఖకు తాగు నీరు అందించేందుకు మరో ఎత్తిపోతలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని తోడటానికి ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతలకు 1,000 కోట్లు, ఏలేరు నుంచి నీటిని తోడిపోసేందుకు ఏర్పాటు చేయనున్న రెండో ఎత్తిపోతలకు 300 కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో దీనిపై సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును కూడా పట్టిసీమ మాదిరే అతి తక్కువ కాలంలోనే నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది.



