ప్రజాభవన్‌లో చంద్రబాబు నాయుడు! ఒక్క ఫోటో చాలుగా!

Chandrababu Praja Bhavan

ఇటీవల తెలంగాణ డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య-సాక్షిల వివాహం జరిగింది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం ఆయన నివాసానికి వెళ్ళి నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తుంటారు. కనుక ఇదేమీ పెద్ద వార్త కాదు. కాకూడదు. కానీ అయ్యింది.. సోషల్ మీడియాలో దీనిపై అప్పుడే భీకర యుద్ధాలు మొదలైపోయాయి.

ADVERTISEMENT

కారణం.. అది తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ముచ్చటపడి కట్టించుకున్న అధికారిక నివాసం ‘ప్రగతి భవన్‌’ కావడమే. ఒకప్పుడు దానిలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు నివాసం ఉండేవారు. దాన్లోకి మంత్రులు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు సైతం అనుమతి లభించేది కాదు.

చాలా మంది గేటు వద్ద పడిగాపులు కాసి నిరాశగా తిరిగి వెళ్ళిపోయేవారు. అలాంటి వారిలో ప్రజాగాయకుడు గద్దర్ కూడా ఒకరు.

అలాంటి భవనంలోకి కేసీఆర్‌ అమితంగా ద్వేషించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రవేశించడం, డెప్యూటీ సిఎం భట్టి కుటుంబ సభ్యులు, ముగ్గురు మంత్రులు అయనకు ఎదురేగి స్వాగతం పలికి అతిధి మర్యాదలు చేయడం బీఆర్ఎస్‌ నేతలు, వారి మద్దతుదారులు జీర్ణించుకోవడం చాలా కష్టమే.

మరీ ముఖ్యంగా ఒకప్పుడు కేసీఆర్‌ టీవిగా కాలు మీద కాలేసుకొని కూర్చునే చోట సిఎం చంద్రబాబు నాయుడు టీవిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవడంతట్టుకోవడం ఇంకా కష్టం!

ప్రజా భవన్‌లో సిఎం చంద్రబాబు నాయుడు-డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తదితరుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఈ పరిస్థితి కేసీఆర్‌ చేజేతులా కల్పించుకున్నారని చెప్పక తప్పదు. కేసీఆర్‌ దానిని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా సకల హంగు ఆర్భాటాలతో నిర్మించినప్పటికీ, అది తన సొంత భవనమన్నట్లు ఎవరినీ లోనికి రానీయలేదు.

కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దాని చుట్టూ కేసీఆర్‌ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలు తొలగించి, దాని పేరు ‘ప్రజా భవన్‌’గా మార్చారు. పేరుకి తగ్గట్లుగానే దానిలోకి సామాన్య ప్రజలను సైతం అనుమతిస్తున్నారు.

నాడు కేసీఆర్‌ కూడా ఇదేవిధంగా చేసి ఉండి ఉంటే, ప్రజా భవన్‌ కూడా అనేక ప్రభుత్వ భవనాలలో ఒకటిగా ఉండేది కదా?

కేసీఆర్‌ కట్టించిన సచివాలయంలోకి సైతం ప్రతిపక్ష నేతలను రానిచ్చేవారు కారు. కానీ కేసీఆర్‌ని గద్దె దించి ఫామ్‌హౌసులో కూర్చోబెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఇప్పుడు దానిలో కూర్చొని పాలన చేస్తున్నారు. రాజభోగం అనుభవిస్తున్నారు.

ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే వాటిలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ ఉండేవారు. కానీ వాటిలోకి వారు అడుగుపెట్టలేకపోతున్నారు… ఎటువంటి ఆంక్షలు విధించనప్పటికీ!

సామాన్య ప్రజలు, అన్ని పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు స్వేచ్చగా వాటిలోకి రాకపోకలు సాగిస్తున్నప్పుడు కేవలం బీఆర్ఎస్‌ పార్టీ నేతలు మాత్రమే ఎందుకు అడుగుపెట్టడం లేదు?అంటే అసూయ, ద్వేషం వల్లనే అనుకోవాల్సి ఉంటుంది.

ఆ రెండు అవలక్షణాలను వారు రాష్ట్రంలో చాలా మందికి వ్యాపింపజేశారు కూడా. అందువల్లే ప్రజా భవన్‌లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అడుగుపెడితే సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తున్నారని చెప్పక తప్పదు.

కానీ పార్టీలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా చూసినట్లయితే రెండు రాష్ట్రాల ప్రజల మద్య, ప్రభుత్వాల మద్య, పార్టీల మద్య ఇలాంటి సత్సంబందాలే ఉండాలి. అదే అందరికీ మంచిది.

ADVERTISEMENT
Latest Stories