2014 ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం నిర్వహించిన ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ, 2019 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఏదైనా ప్రాంతం నుండి వైసీపీ పోటీ చేయబోతున్నారా? అంటే… ఈ ప్రశ్నకు ‘కాదు,’ అలాంటి అవకాశమే ‘లేదు’ అంటున్నారు పృధ్వీ. గత ఎన్నికలలో తన సన్నిహితుడు పోటీ చేయడంతో, ప్రచారం చేశాను తప్ప, తనకు వేరే ఉద్దేశం లేదని, నిజానికి ఇప్పటికే ప్రేక్షకులు తనకు ఎమ్మెల్యే, ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ వంటి పదవులు ఇచ్చేసారని, అంతకు మించి తనకు ఏమీ అవసరం లేదని అన్నారు.
అలాగే ‘జనసేన’ తరపున బరిలోకి దిగిన ఇండస్ట్రీ వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తే… పవన్ కళ్యాణ్ గారికి మార్పు తీసుకురావాలన్న తపన, మార్పు కోసం కష్టపడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో 1000% ఉందని కితాబిచ్చారు. గత ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఉంటే, ఇప్పటికి పృధ్వీ ఎమ్మెల్సీ అయ్యుండేవారని, అలాగే మంత్రి పదవి కూడా దక్కి ఉండేదన్న ప్రచారం నిజమా? కాదా? అంటే… అలా జరిగితే నా కంటే ఎక్కువ నా సన్నిహితులే సంతోషిస్తారని అన్నారు.
‘ఉన్న ఊర్లో మెడికల్ క్యాంపులు, సర్వీస్ లు చేయడం’ మంచి పని అని, అది చాలనేది తన అభిప్రాయమని వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. అలాగే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం ధీనావస్థలో ఉన్న వారికి తనకు తోచిన విధంగా సహాయం చేస్తుంటానని, ఏదైనా మంచి అవకాశాలు వస్తే… వాళ్ళకు రిఫర్ చేస్తుంటానని తెలిపారు పృధ్వీ.



