విశాఖ రాజధాని పేరు చెప్పి వైసీపీ నేతలు నగరంలోనే కాకుండా అటు అనకాపల్లి, ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు భారీగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం అమరావతిరాజధాని భూములలో ఆర్-5 జోన్ సృష్టించి దానిలో 1,402 ఎకరాలలో ఒక్కో కుటుంబానికి సెంటు (48.4 చదరపు గజాలు) చొప్పున 50,793 మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా, వివాదాస్పద భూములను పేదలకు పంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పేదలకు గూడు ఏర్పాటు చేస్తుంటే అసూయతో రగిలిపోతున్న ప్రతిపక్షాలు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని సిఎం జగన్, మంత్రులు ఆరోపించారు. పేద కుటుంబాలు నివసించేందుకు కేవలం 48.4 చదరపు గజాల ఇళ్ళు సరిపోతాయని వాదిస్తున్న వైసీపీ నేతలు మాత్రం ఒక్కొక్కరు కనీసం ఎకరంపైన విస్తీర్ణంలో విలాసవంతమైన భవనాలు నిర్మించుకొంటుంటారు.
ఇందుకు తాజా ఉదాహరణలుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి కోసం విశాఖలో మధురవాడలోని సర్వే నంబర్ 386/పీ లో 5,076 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విలాసవంతమైన భవనం, వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న సీబీసీఎన్‌సీ భవనాలు కనిపిస్తున్నాయి.
ధనికులు తమ స్థాయికి తగ్గట్లు విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం సహజమే. కనుక విజయసాయి రెడ్డి కుమార్తె కోసం విలాసవంతమైన భవనం నిర్మించడాన్ని తప్పు పట్టలేము. కానీ వీటికి సంబందించి ఖాళీ స్థలం పన్ను (వెకాంట్ ల్యాండ్ టాక్స్) చెల్లించకుండా భవన నిర్మాణాలు చేస్తుండటమే తప్పు.
ఈ విషయాన్ని మీడియా బయటపెట్టేవరకు విశాఖ జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదు! మీడియాలో వార్తలు రావడంతో నేహారెడ్డి కోసం నిర్మిస్తున్న భవనానికి రెండేళ్ళకు కలిపి ఖాళీ స్థలం పన్ను రూ.15,89,804, ఎంపీ సత్యనారాయణ నిర్మిస్తున్న భవనానికి రూ. 90 లక్షలు చెల్లించాలని జీవిఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ కధను ఇక్కడితో ‘మమ’ అనిపించేసేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారే తప్ప 2010 నుంచి 2023 వరకు 13 ఏళ్ళకు ఖాళీ స్థలం పన్ను వసూలు చేసే ప్రయత్నం చేయడం లేదు. ఏడాదికి రూ.7,97,902 పన్ను లెక్కన 13 ఏళ్ళకు సుమారు రూ.104 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండేళ్ళకే పన్నువేశారు.
చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని వాదిస్తున్న మంత్రులు మరి దీనికి ఏమని సమాధానం చెపుతారు? వైసీపీ నేతలకు, వారి బంధుమిత్రులకు చట్టాలు, నిబందనలు ఏవీ వర్తించవా?వారు ఇంటి పన్నులు, ఖాళీస్థలం పన్ను వగైరా చెల్లించనవసరం లేదా?
సామాన్య, మద్యతరగతి ప్రజలు కరెంట్ బిల్లు చెల్లించడం కాస్త ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. కానీ వైసీపీ నేతలు, వారి బంధుమిత్రులు ఈవిదంగా లక్షలు, కోట్ల రూపాయల పన్నులు, ఛార్జీలు చెల్లించకపోయినా వారిని అడిగేవారు ఉండరని ఈ రెండూ నిరూపిస్తున్నాయి.



