క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డులకు వేదికగా సఫారీ క్రికెటర్ హషీం ఆమ్లా మారుతున్నారు. ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ ఏదొక రికార్డు కొల్లగొడుతున్న ఆమ్లా ఖాతాలో తాజాగా 25 సెంచరీల రికార్డు వచ్చి చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు 299 పరుగుల స్కోర్ సాధించడంలో ఆమ్లా కీలక పాత్ర పోషించాడు.
కెరీర్ లో 154వ మ్యాచ్ లో 151వ ఇన్నింగ్స్ ఆడుతున్న ఆమ్లా, అతి తక్కువ మ్యాచ్ లలో 25 సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి (162 ఇన్నింగ్స్ లలో) పేరిట ఉంది. ఆ తర్వాత జాబితాలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ (234), రికీ పాంటింగ్ (279), సనత్ జయసూర్య (373), సంగక్కర్ర (379) ఉన్నారు. ఆమ్లా ఆడుతున్న తీరు చూస్తుంటే… వన్డేలలో 50 సెంచరీలను నమోదు చేసే తొలి క్రికెటర్ గా కీర్తి గడించడం ఖాయం అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకు ముందు వన్డేలో అతి తక్కువ మ్యాచ్ లలో 7000 పరుగులను నమోదు చేసిన క్రికెటర్ గా కూడా రికార్డు సాధించాడు. వన్డేలలో ఆమ్లా యావరేజ్ ఇప్పటికే 50 పరుగులు దాటగా, అర్ధ సెంచరీల సంఖ్య 33కు చేరుకుంది. ఆమ్లా సాధించని రికార్డులలో ఇంకా వన్డేలలో ‘డబుల్ సెంచరీ’ ఒకటి మిగిలి ఉంది. 159 పరుగుల అత్యధిక స్కోర్ తో ఉన్న ఆమ్లా, భవిష్యత్తులో ‘డబుల్ సెంచరీ’ ఫీట్ ను కూడా అందుకుంటాడని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.



