పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు మేనేజర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడిన వైనం ఇప్పటికే వెలుగు చూసింది. అయితే తాజాగా మరో అనుమానస్పదపు సంఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన అబ్రహం అనే రైతుకు స్థానికంగా ఉన్న ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 24 నుంచి ఆయన ఖాతాలో రోజూ ఒక కోటి రూపాయలు జమ అవుతున్నట్టు, అలాగే డ్రా అవుతున్నట్టు అతడి మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయట.
ఏం జరుగుతుందో తెలియని సదరు ఖాతాదారుడు, తన స్నేహితుడు అయిన ఆల్ ప్రెడ్ రాజుకు ఈ విషయం చెప్పగా, ఆయన శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని వివరించారు. రైతు సెల్ నంబర్ 99890 50379కు వస్తున్న మెసేజ్‌లను విలేకరులకు చూపించారు. మొత్తం 68 మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కూడా 1,96,07926 జమ అయినట్టు, సాయంత్రం 1,33,48781 డ్రా అయినట్టు మెసేజ్‌లు వచ్చాయని వివరించారు.
నగదు జమ, ఉప సంహరణపై అధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. తన బ్యాంకు ఖాతాలో రోజూ కోటి రూపాయలు జమ అవుతుండడం, ఆ వెంటనే డ్రా కావడంతో ఓ రైతుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీనిపై పూర్తి విచారణ జరిపితే తప్ప అసలు వాస్తవాలు ఏంటో వెలుగు చూసే అవకాశం లేదు.



