బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనలు తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. అయితే ఈ సినిమాను పైరసీ చేసిన ఓ వ్యక్తి దీనిని సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్, యూ ట్యూబ్ లో విడుదల చేసేశాడు.
‘దంగల్’ సినిమా ఫుల్ కాపీని ఫేస్ బుక్ లో పెట్టిన 14 గంటల్లో 8,33,000 మంది ఉచితంగా చూసేయడం విశేషం. అలాగే మరికొందరు డౌన్ లోడ్ కూడా చేసుకున్నారు. ఈ విషయం చిత్ర యూనిట్ కు తెలియడంతో ‘దంగల్’ సినిమాను ఫేస్ బుక్, యూ ట్యూబ్ యాజమాన్యంతో చర్చించి లింక్ ను తొలగించారు. ఈ సినిమా విజయాన్ని ఈ పైరసీ లింక్ లు అడ్డుకోనప్పటికీ… స్మార్ట్ ఫోన్ యుగంలో థియేటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరాన్ని తగ్గించేస్తుందని యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దుబాయ్ కి చెందిన వ్యక్తి ఈ పైరసీ లింక్ ను సోషల్ మీడియాలో పెట్టినట్టు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాతో పాటు వెబ్ ప్రపంచంలో ఈ సినిమా పైరసీ లింక్ లు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారు. బాలీవుడ్ సినిమాలు విడుదలైన మొదటి రోజే పైరసీ రూపంలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉండడం బాలీవుడ్ దర్శకనిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎంత పైరసీ వచ్చినా, మరో పక్కన హౌస్ ఫుల్ కలెక్షన్స్ ప్రేక్షకులు ‘దంగల్’కు నీరాజనం పలుకుతున్నారు.



