తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందని దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలకు నాంది పలికారు. చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘పెళ్లిచూపులు’ చిత్రం విజయోత్సవ సభకు విచ్చేసిన దర్శకరత్న… ఏ ‘హీరో’ పేరునూ ప్రస్తావించకుండా వారిలో ‘ఈగో’ పెరిగిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసారు. మన హీరోలను వారి అభిమాన దర్శకులు ఎవరని ప్రశ్నిస్తే… ఇక్కడ ఉన్న రాజమౌళి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్ ల పేర్లు చెప్పకుండా ఏ మురుగదాసో, ఇంకో దాసో అంటున్నారని, లేకుంటే హిందీ వాళ్లు, ఇంగ్లీష్ వాళ్ల పేర్లు చెబుతున్నారని సెటైర్లు వేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎందరో గొప్పవాళ్లున్నా వారి పేర్లు చెప్పేందుకు మనసు రావడం లేదని, ఇది ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే అంటుకున్న జబ్బని మండిపడ్డారు. పెద్ద సినిమాలను వేల థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాతలపై కూడా ఫైర్ అయ్యారు దాసరి. చాలా మందికి ధియేటర్ల పిచ్చి పట్టిందని, 500, 1000 థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే, నాలుగో రోజుకు సినిమాను ఎవరు చూస్తారని పశ్నించారు.
తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఎంతో అసంతృప్తిగా ఉందని, ఇండస్ట్రీ చెడిపోయిందన్న అంచనాకు వచ్చేశానని, తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారని, ఇది “పెళ్లిచూపులు” ద్వారా మరోసారి నిరూపణ అయ్యిందని, రీమేక్ ల వైపుకు మొగ్గు చూపకుండా తెలుగులోనే మంచి చిత్రాలు తీయాలని, అప్పుడే తెలుగు సినీ పరిశ్రమ తలెత్తుకు నిలుస్తుందని అన్నారు ఈ దర్శక దిగ్గజం. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ రీమేక్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి దాసరి చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమో లేక మెగా వర్గాన్ని ఉద్దేశించేనా? అన్నది మరోసారి చర్చలకు తెరలేపింది.



