మెగాస్టార్ మెగా మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చే వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరన్న విషయం తెలిసిందే. చెర్రీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, తాజాగా దాసరి కూడా ఈ వేడుక గురించి స్పందించారు. “చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని, చిరంజీవి ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని” తెలిపారు.
చిరంజీవి అగ్రస్థాయి నటుడని, తనకు అవసరమైన స్టార్ డమ్ ఇప్పటికే సంపాదించేశాడని, కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఆ ఆదరణ ఉందా? లేదా? అని చెప్పడానికి ఈ 150వ సినిమా పునాది అవుతుందని, చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని, అతని కష్టం గురించి చాలా విన్నానని, విభేదాలు, భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని అన్నారు.
తన 50 ఏళ్ల కెరీర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తాను ఏదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరని, టాలీవుడ్ లో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలను భరించగల శక్తి ఉంటుందని, అలాంటిది రెండు పెద్ద సినిమాలన్నది పెద్ద సమస్య కాదని… ‘ఖైదీ నెంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాల గురించి వ్యాఖ్యానించారు. రెండూ వేటికవే వైవిధ్యమైన కథాంశం గల సినిమాలని, తెలుగు సినీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరిస్తారని తెలిపారు.



