జులై మద్యానికి వచ్చినా వాతావరణంలో ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. వేసవి 2.0 అన్నట్టుగా సూర్యుని భగభగలు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ఒకపక్క ఎండ తీవ్రత, మరోపక్క ఉక్కదీత, ఇంకో పక్క తాగు నీరు, సాగు నీటి ఎద్దడి ఇలా దేశం మీద ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
వర్షాల కోసం రైతన్నలు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు, అయినా ఇంకా తొలకరి చిలుకు వారిని పలకరించనే లేదు. అలాగే సాగు నీటి కోసం ప్రభుత్వాల వైపు చూస్తున్నారు, కానీ నీటి ప్రాజెక్టులలో చుక్క నీరు విడుదల కావడం లేదు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య నీరు, రక్తం గా మారి రాజకీయం నడుస్తుంది, కానీ దాని ఫలితంగా రైతుల నీటి కష్టాలు తీరడం లేదు. తెలంగాణలో అధికార పార్టీ నేతలు, మంత్రులు ఇప్పటికే తమ రాష్ట్ర రైతన్నలకు ఎల్‌నినో కష్టాలను వివరిస్తూ నీటి అవసరం తక్కువగా ఉండే పంటల వైపు మొగ్గుచూపాలంటూ సూచనలు చేస్తున్నారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలని, అందుకోసం జొన్న, పెసర, మినప, సజ్జ, సోయాబీన్స్, కంది వంటి నీటి సాంద్రత తక్కువగా ఉండే పంటలను ఎంచుకోవాలన్నారు.
అందుకోసం ప్రభుత్వం రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తుందని, అలాగే వారి పంటలకు ప్రోత్సాహకాలు కూడా అందించే ఆలోచనలో ఉన్నట్టు తెలియచేసారు. అయితే రైతుల ఆందోళన చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ఈ ప్రకటనలు రైతన్నను ఏమేరకు తృప్తి పరచగలదు అనేది చెప్పడం అసాధ్యం.
ప్రభుత్వాలు తమకు తెలియని ప్రత్యామ్నాయ పంటల గురించి చెప్పే బదులు తమకు సాగు నీరు అందించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్ష శాతం సరిపడ స్థాయిలో ఉండకపోవడంతో అటు రైతులతో పాటుగా ఇటు ప్రభుత్వాలకు కూడా ఎల్‌నినో అగ్నిపరీక్షే అవుతుంది.
రైతుల సాగు నీటి కష్టాలు తీరాలన్నా, ప్రజల తాగు నీటి అవసరాలు పూర్తి కావాలన్నా రాష్ట్రాలలో ఉండే నీటి ప్రాజెక్టులు నిండు కుండలు మాదిరి కళకళలాడాల్సిందే. లేదంటే పడిన ప్రతి వర్షపు చుక్కను ప్రభుత్వాలు ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక నదుల అనుసంధానం ఒక్కట్టే ఇటువంటి ఎల్‌నినో విపత్తుల నుంచి రైతులను, ప్రభుత్వాలను బయటపడేయగలదు. ఆ దిశగా ముందగుడు వేసే నాయకుడే ప్రజల మనసు మెచ్చిన నేతగా గుర్తింపు పొందుడతాడు. అయితే ఈ విషయంలో కూడా బాబు విజనరీ ఇతర నాయకులకు ఒక దిక్సూచి అనే చెప్పాలి.
రాష్ట్ర విభజనతో అల్లాడుతున్న ఏపీని ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టాలని అంటే ముందుగా ఇక్కడ ప్రాంత ప్రజల దాహార్థిని, రైతుల సాగు నీటి కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన బాబు పోలవరం ప్రాజెక్ట్ కు అనుసంధానంగా ‘పట్టి సీమ’ను నిర్మించారు.
కృష్ణ, గోదావరి నదుల అనుసంధానంతో మొదలైన ఈ ప్రాజెక్ట్ రికార్డు సమయంలో పనులు పూర్తి చేసుకుని ఏపీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనితో గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడంతో గుంటూరు – డెల్టా ప్రాంతాలలోని వ్యవసాయానికి సాగు నీటి భద్రత ఏర్పడింది.
మరి ఇటువంటి వాతావరణ విపత్తుల నుంచి తమ రాష్ట్ర రైతన్నలను బయటకు తెచ్చేందుకు తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ నిర్మించారో బిఆర్ఎస్ నేతలు చెప్పగలరా.? అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ నదుల అనుసంధానం కోసం ఏ మేరకు ప్రయత్నాలు చేసిందో వివరించగలదా.?




