దావోస్‌ పెట్టుబడులు: ఎందుకింత గోప్యత?

Nara Lokesh at Davos investment meet

ప్రస్తుతం దావోస్ సదస్సులో బిజీబిజీగా గడుపుతున్న మంత్రి నారా లోకేష్‌ అక్కడ సిఎన్‌బీసి-టీవీ 18 న్యూస్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

“గతంలో చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా దావోస్ సదస్సుకి వచ్చి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకువెళుతుండేవారు. ఇప్పుడు మీరు కూడా వస్తున్నారు.

ADVERTISEMENT

అయితే మీరు కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడానికే పరిమితం కాకుండా, సదస్సు వెలుపల దేశవిదేశాలకు చెందిన పలువురితో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. దేనికి?” అని న్యూస్ ఛానల్‌ ప్రతినిధి ప్రశ్నించారు.

ఆమె ప్రశ్నకు మంత్రి నారా లోకేష్‌ చెప్పిన సమాధానం వింటే, ఆయన కూడా తండ్రిలా ఎంత లోతుగా, ఎంత దూరం ఆలోచిస్తారో అర్ధమవుతుంది.

మంత్రి నారా లోకేష్‌ ఏమన్నారంటే, “అవును దావోస్ సదస్సులో పెట్టుబడులు సాధించడం ఒక్కటే మా లక్ష్యం కాదు. ఈ సదస్సుకు వచ్చినవారిని కలుస్తుండటం వలన రాబోయే రోజుల్లో ఏయే రంగాలలో అభివృద్ధి జరుగబోతోంది? ఏయే రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు?వాటికి ప్రభుత్వం తరపున ఎటువంటి ఏర్పాట్లు, సదుపాయాలు ఆశిస్తున్నారు?వంటి అనేక కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. కనుక దావోస్ పర్యటన గొప్ప అనుభవంగా భావిస్తున్నాను,” అని అన్నారు.

పెట్టుబడుల సాధన గురించి అడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, కాగ్నిజెంట్‌తో సహా పలు ఐటి కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు నెలల్లోగా పెట్టుబడులకు సంబంధించి మరో సంచలన వార్త చెప్తాను,” అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అంటే ఈసారి దావోస్ సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడి సాధించినట్లు అర్ధమవుతోంది.

గతంలో అక్కడే ఎంవోయులు చేసుకొని ఆ వివరాలు ప్రకటించేవారు. కానీ ఆవిధంగా చేయడం వలన వాటి గురించి వైసీపీకి కూడా తెలుస్తుండేది. అప్పుడు ఆ పార్టీకి చెందినవారు ఆయా కంపెనీలకు ఈమెయిల్స్ పంపించి రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని, రాజకీయ సుస్థిరత లేదని కనుక మీ పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం భద్రత, భరోసా కల్పించలేదని హెచ్చరిస్తూ అడ్డుపడుతుండేవారు.

వైసీపీ హెచ్చరికలకు భయపడి కొందరు విదేశీ పెట్టుబడిదారులు వెనక్కు తగ్గుతున్నారని కూటమి ప్రభుత్వం గ్రహించి వ్యూహం మార్చింది. అందుకే దావోస్ సదస్సులో ఎంవోయూలు చేసుకోవడం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని ఈమెయిల్స్ పంపుతున్న వైసీపీ నేతలే, అవి ఎపీకి వచ్చినప్పుడు వాటి క్రెడిట్ తీసుకోవడానికి ఆరాటపడుతున్నారని మంత్రి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి సగర్వంగా చెప్పుకోవలసిన తరుణంలో ఆ వివరాలను చివరి వరకు గోప్యంగా ఉంచాల్సి రావడం చాలా బాధాకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories