విభజనతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారితే, వైసీపీ ఆవిర్భావంతో ఏపీలో రాజకీయాలు గమ్యం లేని ప్రయాణం లా సాగుతున్నాయి. తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఏపీలో మొట్టమొదటిసారిగా “శవ రాజకీయాలకు” తెర లేపారు వైస్ జగన్. ఆ తరువాత ఓదార్పు యాత్ర అంటూ “సింపతీ యాత్ర”లకు శ్రీకారం చుట్టారు.
ఇక అక్కడి నుంచి వైసీపీ పార్టీ పేరుతో వైస్ జగన్ ఏపీలో రేపిన రాజకీయ చిచ్చు ఇప్పటికి మండుతూనే ఉంది. లక్ష కోట్ల అవినీతి మరకలు అంటించుకుని, పదుల సంఖ్యలో అక్రమాస్తుల కేసులు మీదేసుకుని దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపిన తరువాత బయటకొచ్చిన జగన్ ఏపీలో తన రాజకీయ చదరంగం మొదలుపెట్టారు.
ఈ చదరంగానికి అవసరమైన అన్ని వనరులు..చేతిలో లెక్కకు మించిన ఆస్తులు, పత్రికా విలువలు తెలియని సాక్షి ఎటు ఉండనే ఉంది. అలాగే కరుడు కట్టిన తీవ్రవాదుల మాదిరి కొంతమంది నాయకులను తయారు చేసి వైసీపీ అనే పద్మవ్యూహంలో బంధించి ఏపీ రాజకీయాలలో “బూతుల సంస్కృతిని”, వ్యక్తిగత దాడులను ప్రవేశపెట్టి ఏపీ రాజకీయాల దిశా దశ మార్చేశారు.
అలాగే వైసీపీ ఆవిర్భావముతో ఏపీలో కుల రాజకీయాలు తన పరిధిని విస్తరించుకుంటూ చివరకు అవి రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ని ‘కమ్మరావతి’ గా మార్చే స్థాయికి రాజకీయాలను దిగజార్చారు వైస్ జగన్. కులాల మధ్య విద్వేషం రెచ్చకొట్టి ఆ మంటలో తన పార్టీకి వెలుగును సృష్టించుకోవడానికి అవకాశాలు వెతుక్కున్నారు జగన్.
అలాగే ఏపీలో ఎన్నడూ చూడని, మత వైషమ్యాలు సృష్టించడానికి తన ఐదేళ్ల అధికారాన్ని పునాదిగా మార్చుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఏపీలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు, ఆ దాడులను వెనకేసుకొచ్చేలా అప్పటి మంత్రులు చేసిన ప్రకటనలు ఇప్పటికి ఏపీలో హిందూ మతాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి.
తప్పులు చెయ్యడం, పక్క వారిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు చెయ్యడం తద్వారా ఏపీలో అలజడి వాతావరణం సృష్టించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యే. ఇక ఏపీలో తాజాగా రగులుతున్న శ్రీవారి లడ్డు వివాదం కూడా గత ఐదేళ్ల వైసీపీ పాపఫలితమే అంటూ కూటమి ప్రభుత్వం ఆధారాలతో ప్రజలకు వాస్తవాలను వివరించింది. అలాగే దోషులను చట్టం ముందు నిలబెట్టడానికి సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
లడ్డు తయారీలో వాడే నెయ్యి అపవిత్రమయ్యింది అంటూ వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు బాబు. ఊహించని వివాదం ఎదురవడంతో కాస్త సైలెంట్ అయినా వైసీపీ మళ్ళీ తన అరాచకానికి పదును పెట్టింది. తండ్రి శవాన్ని సైతం తన రాజకీయ అవసరాలకు వాడుకున్న జగన్ కు శ్రీవారి లడ్డు వివాదం ఒక లెక్కా అన్నట్టుగా ఇక ఏపీలో మత విద్వేషాలు రెచ్చకొట్టడానికి తిరుమల యాత్రకు సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు జగన్.
దీనితో ఇప్పుడు తిరుమల తిరుపతిలో రానున్న రెండు రోజులలో వైసీపీ ఎం సృష్టించబోతోంది అన్న ఆందోళన, ఆసక్తి రాష్ట్రమంతా వ్యాపించింది. ఏపీలో ప్రశాంత వాతావరణం ఇప్పుడు లేదు, ఎప్పటికి రాదు అని బయట ప్రపంచాన్ని నమ్మించడమే వైసీపీ ముందున్న ముఖ్యమైన ఎజెండా నా..?
అందుకు తగ్గట్టే వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటుందా.? అన్నట్టుగా తన రాజకీయ అడుగులు వేస్తుంది.ఇప్పుడు జగన్ దేవుని తో మొదలుపెట్టిన ఈ చదరంగంలో ఒక్క అడుగు తప్పటడుగు పడినా అది వైసీపీ ని భూస్థాపితం చేయకమానదు.




