గురి తప్పిన జగనన్న బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా?

YS Sharmilaఆస్తులు పంపకాలో, పదవులు పంపకాలో కారణాలు ఏవైతేనేమీ వైఎస్ షర్మిల జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని అన్నలాగే తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలలో రాణించాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలి కానే వేరే రాష్ట్రంలో వెతుక్కొంటే అది ఎన్నటికీ దొరకదనే సంగతి వైఎస్ షర్మిల ఈపాటికి గ్రహించే ఉంటారు. జగనన్న రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ అన్నవుతాడేమో కానీ వైఎస్ షర్మిలకు అన్నగా వ్యవహరించలేకపోయారని ఎప్పుడో తేలిపోయింది కనుక ఒకవేళ వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టాలంటే ముందు సొంత అన్నే ఆమెపై కత్తులు దూసినా ఆశ్చర్యం లేదు. అందుకు ఆమె శక్తి సామర్ధ్యాలు సరిపోవు కనుక తెలంగాణలో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేస్తూ తన భవిష్యత్‌ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఏనాటికైనా జగనన్నను ఆమె ఢీకొనడానికి సిద్దంగానే ఉన్నారనే విషయం వివేకా హత్యకేసులో సునీతక్కకు అండగా నిలబడి మాట్లాడటం ద్వారా స్పష్టం చేశారు. కనుక ఇదివరకు జగనన్న వాడి పారేసిన ఆ బాణం, సరైన విలుకాడు కోసం ఎదురుచూస్తుంటే అకస్మాత్తుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆమెకు కొత్త రాజకీయ ద్వారాలు తెరుచుకొన్నట్లయింది. ఆ ద్వారాలు కాంగ్రెస్ పార్టీవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఆమె బెంగళూరు వెళ్ళి డికె శివకుమార్‌ని కలిసి అభినందనలు చెప్పి వచ్చారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానమే ఆమెకు సందేశం పంపగా ఆమె బెంగళూరు వెళ్ళినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పడంతో, ఉందనే తొలి సంకేతం ఇచ్చారని అందరూ భావిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఆమెకు జగనన్నను ఎదిరించేందుకు ఓ బలమైన అండ అవసరం. అలాగే రాష్ట్రావిభజనతో ఏపీ చచ్చుబడిపోయిన కాంగ్రెస్ పార్టీకి రెడ్డి, క్రీస్టియన్, బీసీ తదితర సామాజిక వర్గాలను ఆకర్షించే వ్యక్తి అవసరం. అదీగాక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలగా ఉంది. వైఎస్ షర్మిల ఎలాగూ తెలంగాణ అంతటా పాదయాత్ర చేసి ఎంతో కొంత బలం పెంచుకొన్నారు. ఆమె కూడా కేసీఆర్‌ను గద్దె దించాలని కోరుకొంటున్నారు కనుక శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీని విలీనం చేసుకోనో లేదా పొత్తులు పెట్టుకొనేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. బహుశః అందుకే ఆమె తనకు అన్ని పార్టీల నుంచి పొత్తుల కోసం మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఉండవచ్చు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఆమె సెట్ కాగలిగితే, తర్వాత ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆమెను స్టార్ క్యాంపెయినర్ లేదా మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిందే జగనన్నను ఇబ్బంది పెట్టడానికి అనే గుసగుసలు కూడా మొదట్లో వినిపించాయి. ఆమె తెలంగాణలో కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే, ఆమె ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి అనే ఏకైక కారణంతో తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టేసుకొని కూర్చోవలసివస్తోంది. ఈ విషయం ఆమె కూడా బాగానే గ్రహించారు. కనుకనే కేసీఆర్‌ మీద అడ్డుఆపులేకుండా రెచ్చిపోతున్నారని భావించవచ్చు. అక్కడ ఆమె హడావుడి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏపీలో జగనన్నకు ఇబ్బందికరమే. ఆమె ఏపీలో అడుగుపెట్టకుండానే జగన్నపై ఈవిదంగా ప్రతీకారం తీర్చుకొంటున్నారని వైసీపీ అనుకూల మీడియా అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల చేతులు కలిపిన్నట్లయితే, ఆమె నెక్స్ట్ టార్గెట్ ఏపీలో జగనన్నే అని భావించవచ్చు. ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఏపీలో అడుగుపెడితే రాష్ట్ర రాజకీయాలలో బలాబలాలు, వాటి లెక్కలు సమూలంగా మారిపోవచ్చు. ఇది నిజమో కాదో త్వరలోనే తేలిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories