‘అమ్మా! నా పేరు ముందు నీ పేరు వేశాను… ‘అంజనీ పుత్ర’ అని… నీ పేరు నిలబెడతాను..,’ పెళ్లైన తరువాత పట్టుమని 10 రోజులు కూడా భార్య రమ్యతో గడపలేదు… ‘పద్మావతి పుత్ర’ రమ్య… నువ్వు గర్వపడేలా ఈ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా తీశాను… ప్రమాణం చేసి చెప్తున్నా ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశాను… ప్రతి తెలుగువాడు చూసి గర్వించేలా ఈ సినిమా ఉంటుంది… అంటూ ఉద్వేగభరితంగా దర్శకుడు క్రిష్ చేసిన ప్రసంగం, ఆడియో వేడుకకే హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమా కధ కోసం ఎంతో రీసెర్చ్ చేసానని, మన తెలుగు వాడైన ‘శాతకర్ణి’ శాసనాలు లండన్ లో ఉన్నాయని, వాటిని సీఎం చంద్రబాబు తెస్తానన్నారని, మన చరిత్రను ఎవరో పూజిస్తున్నా… మనకి మాత్రం చేతకావడం లేదని, తీవ్ర ఆవేదనతో ప్రసంగించారు. మరాఠాలు, తమిళలు, గ్రీకులు కూడా ‘శాతకర్ణి’ని పూజిస్తున్నారని, కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర ఆయనకు సంబంధించిన ఎలాంటి చరిత్ర లేదని ఉద్వేగభరితమయ్యారు.
ఎప్పుడో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అమరావతిని రాజధానిని చేసుకుని పాలించడమేంటి? ఇప్పుడు అదే అమరావతిని రాజధానిని చేయడమేంటని… అంతా దైవసంకల్పంగా అభివర్ణించారు. కోటి లింగాల నుంచి ఆరంభమైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు దేశాన్ని పాలించాడని అన్నారు. ఆ రూపానికి బాలకృష్ణ ఒక్కరే సూట్ అవుతారని, ఈ కథను బాలయ్య అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ… ప్రతి తెలుగువాడు గర్వపడేలా సినిమా ఉంటుందని మరొకసారి స్పష్టం చేసారు క్రిష్.
ఈ సినిమాపై క్రిష్ ఎంత నమ్మకంగా ఉన్నారో ఒక్కసారి ఈ ప్రసంగం చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. క్రిష్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నందమూరి అభిమానులకు ముచ్చటేస్తోంది. ఎందుకంటే… ఈ సంక్రాంతికి ఖచ్చితంగా విజయపు జెండా ఎగరేయడం ఖాయంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. “టికెట్లు తెగడం కోసం కాదు, నాలో ఉన్న కోపం నన్ను ఇలా మాట్లాడిస్తోంది…” అంటూ తన ఆవేదనను స్పష్టంగా చెప్పడంతో ఇది పబ్లిసిటీలో భాగంగా చేసింది కాదు, క్రిష్ గుండెల్లోతుల్లోంచి వచ్చిన వ్యాఖ్యలుగా అర్దమవుతున్నాయి.



