గన్నవరం వైసీపీలో త్వరలో మరో వికెట్ పడబోతోందా?అంటే అవుననే వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గన్నవరం టికెట్ విషయంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మద్య పంచాయితీ ఈనాటిది కాదు. అయితే ఇక అమీతుమీ తేల్చుకోవలసిన సమయం వచ్చేసింది కనుక యార్లగడ్డ మరోసారిగా ఇటీవల గట్టిగా ప్రయత్నించారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరూ కూడా వల్లభనేని వంశీకే మొగ్గు చూపడంతో యార్లగడ్డ వెంకటరావు వైసీపీకి గుడ్ బై చెప్పేసేందుకు సిద్దం అవుతున్నారు.
ప్రస్తుతం పల్నాడు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ త్వరలోనే గన్నవరం చేరుకొంటారు. ఆయన సమక్షంలో యార్లగడ్డ వెంకటరావు టిడిపిలో చేరేందుకు సిద్దం అవుతున్నారని తాజా సమాచారం.
ఈవిషయం వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు కానీ వంశీని కాదని ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక బుజ్జగించే ప్రయత్నాలు చేయడం లేదు. తన పట్ల జగన్ ఇంత నిరాధారణ చూపుతుండటంతో ఆవేదన చెందుతున్న యార్లగడ్డ ఇంకా వైసీపీలో కొనసాగి ప్రయోజనం లేదని భావించి నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ యార్లగడ్డ వెంకటరావు టిడిపిలో చేరితే వచ్చే ఎన్నికలలో గన్నవరం నుంచి ఆయనే పోటీ చేస్తారు. గత ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి, టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీలో చేరిపోయారు.
ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు టిడిపిలోకి మారితే అప్పుడు మళ్ళీ వారిద్దరే ఒకరినొకరు ఎన్నికలలో ఢీకొంటారు. కానీ ఇటువాళ్ళు అటు, అటువాళ్ళు ఇటు మారుతారన్న మాట!
గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఉన్నప్పటికీ వల్లభనేని వంశీ గెలిచారు. అంటే గన్నవరంలో టిడిపి చాలా బలంగా ఉందని స్పష్టం అవుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఉండదు. కనుక ఈసారి అక్కడ రెండు పార్టీలలో ఏది గెలుస్తుందో?



