ఇటీవల వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేశారు. అది చాలా ఆలోచింపజేసేదే. టిడిపికి చెందినవారే పేరు చివర ‘రెడ్డి’ అని తగిలించుకొని తమని పచ్చి బూతులు తిడుతున్నారని, దమ్ముంటే ముసుగులు తీసేసి ధైర్యంగా బయటకువచ్చి ఎదుర్కోవాలని సవాలు విసిరారు.
ప్రస్తుతం రాజకీయాలలో ఉచ్చనీచాలు లేకుండా పోయాయి కనుక విజయసాయి రెడ్డి చెప్పిన్నట్లు వైసీపి కూడా టిడిపి అభిమానులు, కార్యకర్తల పేరుతో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మెతక వైఖరిపై విమర్శలు గుప్పిస్తోండా?
సోషల్ మీడియాలో టిడిపి క్యాడర్‌గా చెప్పుకుంటున్నవారు ప్రదర్శిస్తున్న అసహనం గమనిస్తే, వైసీపి కూడా ఇదే ఫార్ములాతో టిడిపిలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది.
వైసీపి సోషల్ మీడియా కార్యకర్త (!!!) ఇంటూరి రవికిరణ్‌ని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయగా వైసీపి నేతలు వెళ్ళి విడిపించుకు వచ్చారు.
దీనిపై సోషల్ మీడియాలో టిడిపి క్యాడర్ పేరుతో జరుగుతున్న చర్చలలో పార్టీ అధిష్టానం, తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. టిడిపిని నమ్ముకొని ఎంత పనిచేసినా అధికారంలోకి వస్తే క్యాడర్‌ని ఎవరూ పట్టించుకోరంటూ, టిడిపి కోసం ఇక పనిచేయడం వేస్ట్ అంటూ కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఐదేళ్ళుగా తమని వేధించిన వైసీపి నేతలపై టిడిపి కూటమి ప్రభుత్వం త్వరగా, కటినమైన చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి పార్టీ క్యాడర్‌లో ఉందని కానీ తాను జగన్‌లాగ ప్రవర్తించలేనని, అంతా చట్టప్రకారమే జరుగుతుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలలో సిఎం చంద్రబాబు నాయుడు తీరుని తప్పు పడుతూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే, వారు నిజంగానే టిడిపి క్యాడరేనా?టిడిపి మద్దతుదారులేనా లేక టిడిపి ముసుగులో వైసీపి గ్యాంగులే ఈవిదంగా టిడిపిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయా? అనే సందేహం కలుగుతుంది. నిజానిజాలు తెలుసుకోవలసిన బాధ్యత టిడిపికే ఉంది కదా?




