వైసీపి అత్యుత్సాహం మళ్ళీ బెడిసి కొట్టబోతోందా?

Stone Hurled At CM Jagan

సిఎం జగన్‌పై జరిగిన దాడిని వైసీపి చాలా విస్తృతంగానే ప్రచారం చేసుకుంటోంది. అంటే దాని నుంచి రాజకీయ మైలేజీ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే దాని అత్యుత్సాహంతోనే వైసీపికి ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వ్యవహారంలో కూడా వైసీపి ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, టిడిపి దానిని చాలా ధీటుగా ఎదుర్కోవడంతో ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. అందుకే వాలంటీర్ల వ్యవహారంపై వైసీపి నేతలందరూ సడన్‌గా సైలంట్‌ అయిపోవడం అందరూ గమనించే ఉంటారు.

ADVERTISEMENT

ఇప్పుడు జగన్‌పై దాడి ఘటనలో కూడా వైసీపి తీరు చీకట్లో రాయి విసిరిన్నట్లే ఉందని చెప్పవచ్చు. ఈ ఘటనపై వైసీపి ఇంతగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంతో ప్రజలకు దానిపై సానుభూతికి బదులు అనుమానాలే కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుందని గ్రహించిన్నట్లు లేదు.

మరోపక్క టిడిపి సీనియర్ నేతలందరూ మీడియా ముందుకు వచ్చి ఇది ఈ ఎన్నికల కోసం ఆడుతున్న ‘కోడికత్తి 2.0 వెర్షన్’ మాత్రమే అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. దాడికి సంబందించి అనేక ప్రశ్నలు సంధించి వైసీపిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే డిజిపి, ఇంటలిజన్స్ అధిపతులు బాధ్యత వహించరా? అని గట్టిగా నిలదీస్తున్నారు.

టిడిపి, జనసేన, బీజేపీల సభలో ప్రధాని మోడీ పాల్గొన్నప్పుడే తీవ్ర భద్రతా వైఫల్యాలు ఏర్పడ్డాయని కేంద్రం హోమ్ శాఖ తీవ్ర ఆగ్రహంగా ఉంది.

రాష్ట్రంలో డిజిపితో సహా 22 మంది పోలీస్ ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దానిపై విచారణ జరుపుతోంది కూడా.

ఈ నేపధ్యంలో వైసీపి పాలనలోనే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీద దాడి జరగడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పడుతున్నట్లే ఉంది. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈ ఘటనని తీవ్ర భద్రతా వైఫల్యంగానే భావించి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. దగ్గుబాటి పురందేశ్వరి వ్రాసిన లేఖలో ఇప్పటికే ఈసీ చేతిలో ఉంది. కనుక ఈ వైఫల్యాలకు ఆమె పేర్కొన్నవారే కారణమని భావిస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.

కానీ వైసీపి ఇదంతా గమనించకుండా ఈ ఘటనపై విస్తృతంగా ప్రచారం చేసుకోవడం తన వేలితో తన కన్ను పొడుచుకోవడంగానే చెప్పవచ్చు. ఈ ఘటనతో సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలనే తాపత్రయంతో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల కమీషన్‌కు చాలా బలలైన తప్పుడు సంకేతాలు పంపిస్తున్నామని, దీని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతాయో వైసీపి గ్రహించిన్నట్లు లేదు. కనుక ఈ వ్యవహారంలో వైసీపి అత్యుత్సాహంతో ఆశించిన ఫలితాలు రాకపోగా ఊహించని ఎదురుదెబ్బలు తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories