భారీ అంచనాలు నెలకొన్న ‘బాహుబలి 2’ ఈ నెలాఖరున 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మే మొదటి, రెండు వారాలలో పెద్ద సినిమాల విడుదలలు లేకుండా చూసుకున్నారు. కానీ, మూడవ వారంలో మే 19వ తేదీన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధమ్’ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా విడుదలను మరో రెండు నెలల పాటు వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అనేక సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట, ‘దువ్వాడ’ వాయిదా మినహా మరో ప్రత్యామ్నాయం లేదని చిత్ర యూనిట్ వర్గాలు నిర్ణయించుకున్నారట.
‘బాహుబలి 2’ విడుదలైన మూడు వారాలకు ‘దువ్వాడ జగన్నాధమ్’ ప్లాన్ చేయగా, సమ్మర్లో ‘బాహుబలి 2’ ప్రభంజనం ఎక్కువగా ఉంటే, ఆశించిన ధియేటర్లు లభించడం కష్టమని తేలిపోయింది. ఇక మే 19 మిస్సయితే, మరోవైపు ప్రిన్స్ – మురుగదాస్ ల సినిమా జూన్ 23వ తేదీకి ఫిక్స్ చేసుకున్నారు. అంటే మే చివరి వారంలో గానీ, జూన్ మొదటి వారంలో గానీ విడుదల చేసినా జూన్ 23 నాటికి ధియేటర్లు లేపేయడం ఖాయం. దీంతో సమ్మర్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలన్న ‘దువ్వాడ జగన్నాధమ్’ ఆశలు నేరేవేరే అవకాశాలు చాలా తక్కువగా మారాయి.
ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న నిర్మాత దిల్ రాజు, ‘సేఫ్ గేమ్’లో భాగంగా మే 19 నుండి మరో రెండు నెలల పాటు వాయిదా వేసుకుని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రెష్ రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… బన్నీ వెనుకడుగు వేయడంతో మే 19వ తేదీకి అక్కినేని హీరో నాగచైతన్య ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మే 19కి ఫిక్స్ చేసారట.



