భూతాపం పెరిగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల చేసే కాలుష్యం కారణంగా భూమి నివాసయోగ్యమైన గ్రహం అనే అర్హతను నెమ్మదిగా కోల్పోతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవ జాతికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో మానవ మనుగడ కోసం శాస్త్రవేత్తలు మరో గ్రహాన్ని అన్వేషిస్తున్నారు.
ఈ పరిశోధనల్లో భాగంగా అరుణ గ్రహానికి వెళ్లే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో సౌరకుటుంబానికి ఆవల భూమిని పోలిన మరో గ్రహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అచ్చం భూమిలా ఉన్నప్పటికీ పరిమాణం విషయంలో మాత్రం భూమి కంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుందని గుర్తించారు. దీనిని చాలా కాలం నుంచి గమనిస్తున్నట్టు, ఈ గ్రహంపై 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
అలాగే నీరు ఉండే అవకాశం ఉందని, పెద్ద సముద్రమే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. భూమికి 150 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి ‘సూపర్ ఎర్త్’ అని పేరుపెట్టారు. దీనిని కెప్లర్ టెలిస్కోప్ ద్వారా గుర్తించినట్టు, ఇది సూర్యుడి కంటే చిన్నదైన ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని వారు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించిన తరువాత ఇది జీవయోగ్యమైన గ్రహమో కాదో తేలుస్తామని అన్నారు.



