భారీ వర్షాలతో అల్లాడిపోతున్న ఏపీలోని నగరాలను, పట్టణాలను చూసి ఇది ప్రకృతి విపత్తు అని సరిపెట్టుకోవచ్చు. ప్రభుత్వం శక్తివంచన లేకుండా సహాయ చర్యలు చేపడుతోందని సమర్ధించుకోవచ్చు.
అయితే హైదరాబాద్‌లో మాదిరిగానే ఏపీలో కూడా పలు నగరాలు, పట్టణాలలలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో భూబకాసురులు రెచ్చిపోయి కబ్జాలు చేశారు. ముఖ్యంగా గత 5 ఏళ్ళలో విశాఖ రాజధాని పేరుతో వైసీపి దొరబాబులు విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో భారీగా భూకబ్జాలు చేశారు. చివరికి విశాఖ నగరానికి పర్యాటక ఆకర్షణ కేంద్రంగా నిలిచిన ఎర్రమట్టి దిబ్బలను కూడా విడిచిపెట్టలేదు.
భారీ వర్షాలతో ముంపుకి గురయిన విజయవాడ, గుంటూరు నగరాలని చూస్తున్నప్పుడు, ఆ రెండు నగరాలలో ఎన్ని కాలువలు కబ్జా అయ్యాయనే అనుమానం కలుగక మానదు.
అయితే వైసీపి లేదా వేరెవరి భూకబ్జాలని గుర్తించడానికి టిడిపి కూటమి ప్రభుత్వం సాంప్రదాయ పద్దతిలోనే ముందుకు సాగుతోంది. అయితే అది కనిపెట్టి చర్యలు తీసుకునేలోగా మళ్ళీ ఎన్నికలోచ్చేసినా ఆశ్చర్యం లేదు. పైగా కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు చేపడితే ‘రాజకీయ కక్ష సాధింపు’ ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియాలో వైసీపి హడావుడి తప్పదు.
కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన్నట్లే చెరువులు, కాలువలు, కొండలని కబ్జాల నుంచి విడిపించేందుకు ‘హైడ్రా’ వంటి ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా అవసరం. తద్వారా ప్రభుత్వం పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు.
ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే, కేరళలోని వయనాడ్ ప్రకృతి విపత్తు చూసిన తర్వాత విశాఖ, విజయవాడతో సహా పలు నగరాలు, పట్టణాలలో కొండలపై నిర్మించుకున్న ఇళ్ళ విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది.
ఒక్క విశాఖ నగరంలోనే వేలాది ఇళ్ళు కొండవాలులో నిర్మించుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చరియాలు విరిగిపడి ఇళ్ళపైపడి మనుషులు చనిపోతున్న వార్తలు చూస్తూనే ఉన్నాము. విశాఖలో కూడా అటువంటి ప్రమాదం పొంచి ఉంది.
ముఖ్యంగా భారీ వర్షాలకు ఇళ్ళ పునాదుల కింద నుంచి మట్టి కరిగి దిగువకు కొట్టుకుపోతుండటంతో పలు ఇళ్ళు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కనుక పెను ప్రమాదం జరుగక మునుపే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే బురద జల్లెందుకు వైసీపి సిద్దంగానే ఉంది.




